తిరోగమన విధానాలు తిప్పికొట్టాలి
బీజేపీ పాలనలో మహిళలపై పెరుగుతున్న హింస : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
రాష్ట్ర మహాసభల సందర్భంగా సెమినార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆధునిక యుగంలో మనం ఎంతో పురోగమిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ మహిళలపై హింస రకరకాలుగా సాగుతూనే ఉందనీ, స్త్రీల పట్ల వివక్షకు, హింసకు మూలాలు సమాజంలోనే ఉన్నాయనీ, మనిషి బుర్రను పురుగులా తొలుస్తున్న మనువాదాన్ని ఎదిరించకుండా అభివృద్ధి సాధించ లేమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే చెప్పారు. ఐద్వా రాష్ట్ర మహాసభల సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మనువాదం-మహిళా హక్కులపై ప్రభావం’ అంశంపై ఆ సంఘం ఉపాధ్యక్షులు బుగ్గవీటి సరళ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మరియం ధావలే మాట్లాడుతూ స్త్రీల పట్ల సాగుతున్న చిన్నచూపు, హింసలో మనువాదం ప్రభావం చాలా ఉందని చెప్పారు. ‘స్త్రీ ధర్మాలు’ పేరుతో ”బాలిక, యువతి, వృద్ధురాలు ఎవరైనా బాల్యంలో తండ్రి చెప్పుచేతల్లో, యవ్వనంలో భర్త అదుపాజ్ఞల్లో, భర్త మరణానంతరం కొడుకు ఆధీనంలో ఉండాలి. స్త్రీ ఎన్నడూ తన తండ్రిని, భర్తను, కొడుకులను విడిచి ఉండకూదని ఆంక్షలు విధించారు” అని గుర్తు చేశారు. మనువు శాసనం ప్రకారం భర్తకి తన మీద ఇష్టం ఉన్నా, లేకపోయినా భార్య చిరునవ్వుతో ఉండాలి అని చెప్పటమేంటని ప్రశ్నించారు. మనుధర్మంలో మహిళల పట్ల చూపిన వివక్షకు అంతూపొంతూ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని మంత్రాలు, ఉపోద్ఘాతాలు మహిళలపై రుద్ది- ఇక వారికి తమ గురించి తాము ఆలోచించే ధైర్యం ఎక్కడిది? అని ప్రశ్నించారు. వేళ్లూనుకుపోయిన వీటన్నింటికీ మనువాద భావాలే కారణమని విమర్శించారు.
స్త్రీల శ్రమకు గుర్తింపు లేదని, ఉన్నా నామమాత్రమేననీ, ఈ ధోరణి కూడా హింస, వివక్షకూ ఓ కారణమని తెలిపారు. చట్టాలున్నా అవి మనువాద భావజాలకుల నిర్లక్ష్యం వల్ల అమలుకు నోచుకోవటంలేదని చెప్పారు. తమపై హింసను పెంచే, ఈసడింపును కలిగించే భావజాలాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమానత్వాన్ని కోరుతూ చైతన్య పథంలో సాగాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు పెరిగాయని వివరించారు. ఈ దాడుల్లో బాధితుల కంటే నిందితులకే ప్రభుత్వ సహకారం ఉంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలనూ అంబానీ, అదానీలకు కట్టబెడుతోందన్నారు. అన్నింటినీ ప్రయివేటీకరించడం వల్ల రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. తద్వారా ఎక్కువగా నష్టపోతున్నది మహిళలేనని వివరించారు.
దీనివల్ల నిరుద్యోగం సైతం పెరుగుతోందనీ, ఆదాయాలు తగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలు ప్రజల నుంచి 24 శాతం నుంచి 200 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయన్నారు. కట్టలేని వారిపై ఒత్తిడి పెంచడంతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇందులో అత్యధికంగా మహిళలే బాధితులుగా ఉన్నారని వివరించారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జ్యోతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటోందన్నారు. ఓటు ఎవరికి వేస్తున్నామో ఆలోచించాలని, ఎన్నికల ముందు కులం, మతం, జాతి పేర్లతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. సన్యాసులు, బాబాలు ఆధ్యాత్మిక చింతన పట్ల, భక్తి విశ్వాసాల పట్ల ఉన్న నమ్మకాలను ఆసరా చేసుకుని వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఉపాధి కల్పనలో మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని, వారికి చాలీచాలని వేతనాలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజలను మతపరంగా విడదీయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శిం చారు. ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. మహిళలు లేదా ఆడపిలల్లపై లైంగికదాడి జరిగినప్పుడు కులం, మతం కోణంలోంచి చూడడం ఎక్కువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో చూసి అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి, సహాయ కార్యదర్శులు కేఎన్ ఆశాలత, పాలడుగు ప్రభావతి, పి శశికళ, రాష్ట్ర నాయకులు ఏ పద్మ తదితరులు పాల్గొన్నారు.