Thursday, February 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅభివృద్ధి 'విధ్వంసం'

అభివృద్ధి ‘విధ్వంసం’

- Advertisement -

అభివృద్ధి పేరుతో సాగుతున్న గుట్టల విధ్వంసం పర్యావరణ సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తోంది. గుట్టలే కదా అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ, గుట్టలు వర్షపు నీటిని పట్టి ఉంచి, భూమిలోకి ఇంకేలా చేస్తాయి. వీటిని పిండి చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, బోర్లన్నీ ఎండిపోతున్న పరిస్థితి అనేకచోట్ల కనిపిస్తోంది. అంతేకాదు, జీవవైవిధ్యం కూడా దెబ్బతింటున్నది. నెమళ్లు, కుందేళ్లు, అరుదైన వనమూలికలకు ఈ గుట్టలే నివాసాలు. నేడు క్రషర్ల ధాటికి ఇవి అంతరించిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని శాయంపేట, హన్మకొండ, దామెర, కాజీపేట శివార్లు, ధర్మసాగర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, కురవి, కేసముద్రం, నల్లబెల్లి తదితర పరిసరాల్లో స్టోన్‌ క్రషర్ల జోరు పెరిగింది. కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా డాంబర్‌ ప్లాంట్లు వెలిశాయి. ఇంకొన్ని చోట్ల గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి.

పదుల సంఖ్యలోని ఎకరాలకు అనుమతి తీసుకుని, వందల ఎకరాల్లో గుట్టలను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ శూన్యంగా మారడంతో క్రషర్ల నుండి వచ్చే దుమ్ము చుట్టుపక్కల పంటలు పండకుండా నష్టాన్ని చేకూరుస్తుండటంతో పాటు, ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితికి బలవంతంగా నెట్టివేస్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం వాడాల్సిన దానికంటే ఎక్కువ శక్తివంతమైన పేలుడు పదార్థాలను వాడుడుతున్నారు. దీంతో సమీపంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. దద్దరిల్లిపోయే పేలుడు పదార్థాల శబ్థాలు కూడా ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రశ్నించే వారులేక, ఒకవేళ ప్రశ్నించినా, ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టే అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నగరాలు, గ్రామాల చుట్టూ రక్షణ కవచాల్లా ఉన్న గుట్టలు నేడు వెంచర్ల పేరుతో, కంకర క్వారీల పేరుతో మైదానాలుగా మారుతున్నాయి. అడవుల నరికివేత, కొండల పిండి కొట్టడం వల్ల అకాల వర్షాలు లేదా తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. గాలిలో ధూళి కణాలు పెరిగి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధులు ప్రబలుతాయి. సహజ సిద్ధమైన గాలి మళ్లింపు లేక నగరాల్లో ఉక్కపోత పెరుగుతుంది. ఈ పర్యవసనాల ఫలితం ఇప్పటికే చూస్తున్నాం. అభివృద్ధి అవసరమే, కానీ అది పర్యావరణాన్ని బలిపెట్టి చేసేది కాకూడదు. అధికారులు నిబంధనలు ఉల్లంఘించే క్రషర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ”ఈరోజు మనం కొండలను మింగేస్తే.. రేపు పర్యావరణం మనల్ని మింగేస్తుంది” అన్న సత్యాన్ని గ్రహించి ప్రజలు కలిసికట్టుగా గుట్టలను కాపాడుకోవాలి.

రాజేందర్‌ దామెర

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -