విద్య, వైద్యం, సంక్షేమమే ప్రాధాన్యత : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ధర్మపురిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ధర్మపురి
‘అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాల భవనాల నిర్మాణం కాదు.. సామాన్యుడి జీవితంలో గుణాత్మకమైన మార్పు రావడం.. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందడం’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి సుమారు రూ.236.5 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాలల నిర్మాణంలో భాగంగా.. ధర్మపురిలో రూ.200 కోట్లతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా సొంత భవనం లేక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో శాశ్వత భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమ రంగాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జగిత్యాల జిల్లా అభివృద్ధికి కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోందని వివరించారు.
ఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి వసతులు, డిజిటల్ ల్యాబ్స్, క్రీడా మైదానాలు, డైనింగ్ సదుపాయాలు ఉంటాయని, ఇది పేద పిల్లల భవిష్యత్‌ను మారుస్తుందని తెలిపారు. వసతి లేక చదువుకు దూరమవుతున్న దళిత విద్యార్థుల కోసం రూ.2 కోట్లతో ఎస్సీ బాలుర వసతి గృహాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, కలుషిత నీటి సమస్యను పరిష్కరించడానికి రూ.24.5 కోట్లతో ఎన్టీపీ (శుద్ధ తాగునీటి కేంద్రం) ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రైతు ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంటల బీమా, మద్దతు ధరతోపాటు గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని భరోసా ఇచ్చారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు కేవలం పథకాలు ఇవ్వడమే కాకుండా, వారికి సమాన అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. ఈ ప్రాజెక్టులు సమయంలోపు పూర్తయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో మార్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



