– వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ప్రాంతం అర్బన్ ఫారెస్ట్ పార్క్ తో మరింత అభివృద్ధి చెందుతుందని, అడవులు దురాక్రమణ కాకుండా రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని జిల్లలగడ్డ వద్ద అర్బన్ ఫారెస్ట్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ,మహా సముద్రం గండి , రాయికల్ వాటర్ ఫాల్స్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇవన్నీ టూరిజం గా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. జిల్లాల గడ్డలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేయవచ్చని అటవీశాఖ అధికారులు మా దృష్టికి తీసుకొచ్చి సహకరించారన్నారు.
యువత ట్రెక్కింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఉందనీ, దీనికి సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని పెడితే బాగుంటుందన్నారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రజలు రావడం ప్రారంభం అయితే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. క్రిటికల్ జోన్ కి టాప్ ప్రయారిటీ తీసుకొని ట్రెక్కింగ్ చేయాలన్నారు. భైరవ స్వామి గుడి, సర్వాయి పాపన్న కోటలు టూరిజం గా ఇక్కడ అభివృధి చేస్తామన్నారు.చిల్డ్రన్ జోన్ ఏర్పాటు చేసి వారు ఆటలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ హైమవతి, పిసీసీఎఫ్ సువర్ణ ,సీసీఎఫ్ రామలింగం , డీఎఫ్ఓ పద్మజా రాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ గౌడ్ ,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సర్పంచ్ స్వరూప నాయకులు తదితరులు పాల్గొన్నారు.



