Tuesday, October 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలురూ.251 కోట్లతో సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి

రూ.251 కోట్లతో సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి

- Advertisement -

శాశ్వత పనులతో సందర్శకుల సంఖ్య మరింత
పెరిగే అవకాశం : వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నాణ్యతతో పనులు పూర్తి చేయాలి : మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క
నవతెలంగాణ – ములుగు

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.251కోట్లు ఖర్చు చేయనున్నట్టు వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారానికి హెలికా ప్టర్‌లో మధ్యాహ్నం చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, డాక్టర్‌ దనసరి సీతక్క, మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌కి జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఎస్పీ శబరిష్‌, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి, సీతక్క మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ 90 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఆలయ అభివృద్ది పనులు చేపట్టాలని అన్నారు. ఒకే సమయంలో గుడి నిర్మాణం, జాతర పనుల నిర్వహణ చేయాల్సి ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అనంతరం ఎంపీ పోరిక బలరాం నాయక్‌ మాట్లాడుతూ.. గతంలో మేడారం జంపన్న వాగుపై వంతెన నిర్మాణం కేవలం 45 రోజుల్లో పూర్తి చేశారని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

విజయవంతంగా పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2026 జనవరిలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుందని తెలిపారు. దేవతల సందర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు పాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను 90 రోజులలో పూర్తిచేసేలా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం కోసం రూ.101 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, మరో రూ.71 కోట్ల పనుల కోసం టెండర్లు పిలిచామని అన్నారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో మహా జాతరను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. 2024లో జరిగిన జాతరకు విచ్చేసిన భక్తుల సంఖ్య కంటే 2026 జనవరిలో జరిగే మహా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాహూల్‌ కిషన్‌ జాదవ్‌, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రవి చందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, ఈఎన్‌సీ, ఆర్డీఓ వెంకటేష్‌, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్‌, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -