నవతెలంగాణ – కాటారం
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృషితో కాటారం వ్యవసాయ మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో రూ.20 లక్షల వ్యయంతో ఆర్&బీ రోడ్డునుంచి మార్కెట్ కార్యాలయం వరకు నిర్మించనున్న సీసీ రహదారి పనులను పాలకవర్గ సభ్యులతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని మార్కెట్ యార్డు, మంత్రి శ్రీధర్ బాబు చొరవతో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. రైతులు, వ్యాపారులకు సౌకర్యాలు కల్పించేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మార్కెట్ యార్డుకు కాంపౌండ్ వాల్ నిర్మించి, యార్డు భూమిపై జరిగిన ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబుకు మార్కెట్ యార్డు పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చీరాల బ్రహ్మరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరావు, రమేష్, రామకృష్ణ, ఇర్షాద్, రాజారాం, సంతోష్, మార్కెట్ సెక్రటరీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.



