– అవగాహనకు అరైవ్ అలైవ్ కార్యచరణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం పట్ల డీజీపీ శివధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న హత్యలలో మరణిస్తున్నవారి సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసు అధికారులతో పాటు ఈ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీజీపీ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గానూ నెలపాటు అరైవ్ అలైవ్ కార్యచరణను అమలు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ఈనెల 16న ప్రపంచ రోడ్డు ప్రమాదాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యచరణను రూపొందించామని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలపై నిశితంగా దృష్టిని సారించి, వాటి నివారణ కోసం సమగ్ర కార్యచరణను రూపొందించి, అమలు చేయడమొక్కటే శరణ్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం పోలీసుల బాధ్యతే అని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి లేదనీ, ఇందులో సమాజంలోని అన్ని వర్గాల వారు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కట్టుగా కృషి జరిపితేనే అనుకున్న ఫలితాలను సాధించగలమని డీజీపీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ట్రాఫిక్ నిబంధనలను ఎన్ని రూపొందించినా.. వాటిని మనస్ఫూర్తిగా వాహనచోదకులు అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ఇందుకోసం నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నెల పాటు నిర్వహించబోయే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యచరణకు సమాజంలోని బాధ్యతగల వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు 16వ తేదీలోగా తమ సూచనలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ వాహన చోదకులకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసే ముందు కనీసం 15 రోజుల పాటు శిక్షణనివ్వడం ఆవశ్యకమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించుకొని ప్రమాదాల నివారణకు అవసరమైన యాప్‌ను రూపొందించాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులలో అవగాహన పెంచేలా పాఠ్యాంశాలను కూడా పొందుపర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల నివారణపై ఈనెల 8 లేదా 9వ తేదీన సమావేశమవుదామని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ విభాగానికి చెందిన పలువురు అధికారులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలపై డీజీపీ ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



