Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండీజీపీ జితేందర్‌ ఉద్యోగ విరమణ

డీజీపీ జితేందర్‌ ఉద్యోగ విరమణ

- Advertisement -

ఘనంగా వీడ్కోలు పలికిన సీనియర్‌ ఐపీఎస్‌లు
పోలీస్‌ అకాడమీలో సైతం వీడ్కోలు పరేడ్‌

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు తన పదవీ కాలం చివరి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు విధులను నిర్వర్తించిన జితేందర్‌.. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తూ తన చార్జీను తాత్కాలికంగా శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఆయనతో కరచాలనం చేసి తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకున్నారు. అనంతరం ఆయనను డీజీపీ చాంబర్‌ నుంచి కార్యాలయ పోర్టికో వరకు సగౌరవంగా తోలుకొని వచ్చి అక్కడ పూలతో అలంకరించి ఉన్న ఓపెన్‌ జీబులోకి ఆయనను ఎక్కించారు. నూతన డీజీపీగా నియమితులైన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, నూతన నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి సజ్జనార్‌, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, ఏసీబీ డీజీ చారుసిన్హా, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ వి.వి శ్రీనివాస్‌రావు, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనర్లు సుధీర్‌బాబు, అవినాశ్‌ మొహంతి తదితర సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు జితేందర్‌ నిలుచొని ఉన్న ఓపెన్‌ జీపునకు కట్టి ఉన్న తాళ్లను మెల్లిగా లాగుతూ డీజీపీ కార్యాలయ ప్రధాన గేటు వరకు వెళ్లారు.

ఈ సందర్భంగా జితేందర్‌ పేరుతో జయహౌ నినాదాలు చేశారు. ఒకపక్క పోలీసు వాయిద్య బృందం బ్యాండు మేళం మోగిస్తుండగా, మరోపక్క రిటైరైన డీజీపీపై పూలు చల్లుతూ తోడ్కొని గేటు వరకు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే ఆగి ఉన్న తన సొంత కారులో జితేందర్‌ కూర్చొని అందరు అధికారులు, సిబ్బందికి బైబై చెప్తూ వెళ్లిపోయారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి డీజీపీ ఎం.ఎస్‌ రాజు రిటైరైన సమయంలో ఈ విధమైన వీడ్కోలు సాంప్రదాయాన్ని పోలీసు శాఖలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి రిటైరైన ప్రతీ డీజీపీని ఈ విధమైన సాంప్రదాయంతో ఐపీఎస్‌, ఇతర పోలీసు అధికారులు వీడ్కోలు పలకడం జరుగుతున్నది. జితేందర్‌ వీడ్కోలు కార్యక్రమానికి సైతం పలువురు అదనపు డీజీలు, ఐజీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలతో పాటు డీజీపీ కార్యాలయ మినిస్టీరియల్‌ స్టాఫ్‌ కూడా పాల్గొన్నారు.

పోలీస్‌ అకాడమీలో వీడ్కోలు పరేడ్‌
రిటైర్‌ అవుతున్న డీజీపీ జితేందర్‌కు ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీస్‌ అకాడమీలో గౌరవంగా సాయుధ పోలీసు బలగాలు వీడ్కోలు పరేడ్‌ను నిర్వహించాయి. వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన జితేందర్‌ మాట్లాడుతూ.. తన ఇన్నేండ్ల ఐపీఎస్‌ సర్వీస్‌ లోపల ఎలాంటి మచ్చా లేకుండా రిటైర్మెంట్‌ అవుతున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు పలు హౌదాలలో విధి నిర్వహణ పరంగా ఎదురైన సవాళ్లను తన తోటి అధికారులు, సిబ్బంది సహాయంతో దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగానని అన్నారు. పోలీసు శాఖలో విధులను నిర్వర్తించటం ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు లభించిందని జితేందర్‌ అన్నారు. ఇన్నేండ్ల తన సర్వీసులో సహకరించిన తోటి ఐపీఎస్‌ అధికారులు, తన సీనియర్లు, కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. శాంతి భద్రతల పరంగా రాష్ట్రం మున్ముందు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాలనీ, తాను నేతృత్వం వహించిన మరింత కీర్తి ప్రతిష్టలను గడించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌తో సహా పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

నేడు డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బత్తుల శివధర్‌రెడ్డి బుధవారం ఉదయం 9.43 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ నుంచి బాధ్యతలు అందుకోనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను డీజీపీ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లతో పాటు రేంజ్‌ల ఐజీలు, జిల్లా ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -