Sunday, March 15, 2026
E-PAPER
Homeసందర్భంప్రకృతి ముందా? జీవం ముందా..?

ప్రకృతి ముందా? జీవం ముందా..?

- Advertisement -

ప్రకృతి, మనిషి వేరు వేరుకాదు. ప్రకృతి మనిషి మనుగడకు ఎప్పుడూ తన చేతులు అడ్డు పెడుతూనే ఉంది. కాని మనిషి ప్రకృతి గుండెలను చీల్చుకుంటూ సాగుతూనే ఉన్నాడు. సంవత్సరాలు, యుగాలుగా కాలం పరిగెడుతూనే ఉంది. గడిచిపోతున్న రోజులను కాలం తనలోకి ఒప్పుకుంటూనే ఉంది. తనలోకి ఒంపుకుంటున్న ప్రతిసారీ కాలాన్ని గణించడం, గుణించడం జరుగుతూనే ఉంది. కొన్ని రోజులను కలిపి వారాలు, నెలలు, సంవత్సరాలుగా గణించుకుంటున్నాం. ఇలా కాలం ఒడిలోకి జారుతున్న ప్రతిసంవత్సరాన్ని ఒక కొత్తదనంతో మొదలు పెడితే బాగుంటుంది

మనిషి జీవితంలో గడిచిపోతున్న రోజులు పేలవంగా మారకుండా ఏదో ఒకపండుగ రూపంలో రోజులను అలంకార భరితం చేసుకున్నాడు.
ప్రతి పండుగా ప్రతీకాత్మకంగా ఉండడం ఒక విశేషం. ఏ పండుగ పేరు చెప్పినా ఉదాహరణకు బతుకమ్మ పేరు తలవగానే పూలజాతర, దసరా అనగానే జమ్మిచెట్టు, పాలపిట్ట, ఉగాది అనగానే మామిడి కాయలు, వేపచెట్టు కనులముందు చిత్రమై మెరుస్తాయి.
ఉగాది అనగానే షడ్రుచులు నమ్మేళనం అంటారు. ఉగాది అనగానే తెలుగు వాళ్ల సంవత్సరాది పండుగ అని అందరికీ తెలిసిందే. అయితే వివిధ రాష్ట్రాల్లోనూ ఉగాది పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇది సంవత్సరాది పండుగగా కాకుండా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రం దీనిని సంవత్సరాది పండుగగా జరుపుకుంటారు. ఉగాదిని సాంస్కతిక వారసత్వ పండుగగానే కాకుండా కొంత సైన్స్‌ కూడా దాగి ఉన్నదని కొందరు చెబుతున్నారు. అందులో అంతగా సైన్స్‌ ఏమీ లేదు సైన్స్‌ సెన్స్‌తో ఆలోచించి ఈ పండుగను పెట్టలేదని మరికొందరి వాదన. ఉగాది పండుగ రోజున పంచాంగం చూడటం ఈ సంవత్సర రాశులను పరిగణలోకి తీసుకొని మనుషుల జాతకాలను రాబోయే వాతావరణ స్థితిగతులను పండబోయే పంటల ప్రాధాన్యతను జోష్యం చెప్పడం ఒక ఆచారంగా వస్తున్నది. అయితే ఉగాది రోజున ఉదయాన్నే ప్రతి తెలుగు ఇంటిలో చేసుకొనే ఉగాది పచ్చడి విషయంలో కొంత శాస్త్రీయ చర్చ ఉన్నది. ఉగాది పచ్చడిలో తయారీకి వాడుతున్న వస్తువులన్నీ ఆరోగ్యానికి మంచి చేసే ఉద్దేశంతో వెనకటి వారు రూపొందించారని కొందరు అంటుంటే, అంతగా శాస్త్రీయ అవగాహన లేని కాలములో ఏర్పడ్డ ఈ ఉగాది పచ్చడి ఆచారం వెనుక శాస్త్రీయ ఆలోచన కానీ ఆరోగ్య సూత్రాల ఉద్దేశం కానీ ఉండే అవకాశం లేదనేది మరికొందరి ఉద్దేశం. కేవలం ప్రకతిలో దొరికే కొన్ని వస్తువులతో చేసుకున్న ఉగాది పచ్చడి వెనక సైన్స్‌ ఆలోచన ఏదీ లేదని, కేవలం అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకున్న ఒక పండుగ పానీయంగాను ప్రసాదంగా రూపొందింది అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఈ వాదనలను కాస్త పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న సైన్స్‌ దష్టిలో ఆలోచిస్తే ఈ ఉగాది పచ్చడి మానవ ఆరోగ్యానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనేది చూద్దాం…
ఈ ఉగాది పచ్చడిలో ముఖ్యంగా ఉప్పు, చేదు, కారం, వగరు, తీపి, పులుపు లాంటి రుచుల సమ్మేళనంతో ఏర్పాటు చేస్తారు. ఈ రుచుల సమ్మేళనం కోసం వాడే పదార్థాల్లో ఉప్పు, కొత్త చింతపండు, మిరియాలు లేదా కారం, వేప పువ్వు, కొత్త బెల్లం, పచ్చి మామిడికాయ లాంటి పదార్థాలతో తయారుచేస్తారు. తీపి కోసం వాడే బెల్లంలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. బెల్లం సహజసిద్ధ పోషకాలతో కూడుకున్నది. ఇందులో ఐరన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటుగా శ్వాసకోశ సమస్యలను నివారించే గుణం దీనికి ఉన్నది. ఇందులో వాడే వేప పువ్వుకు మరింత ప్రాధాన్యం ఉన్నది. ఇది యాంటీ బ్యాక్టీరియాలా పనిచేస్తుంది. యాంటీ ఫంగస్‌గా కూడా పనిచేస్తుంది. మొటిమలను, చర్మం ముడతలను తగ్గించడంలో ఇది ఉపయోగకారి. మానసిక ప్రశాంతతలో కీలకపాత్రను పోషిస్తుంది. జీర్ణక్రియ, చర్మ సౌందర్యానికి రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది.
కారం కోసం వాడే మిరియాలు ఇవి కూడా ఒక శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్‌, ఆంటీ ఇన్ఫ్లోమేటరీగా కూడా పనిచేస్తుంది. అంటే శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించి, గొప్ప రోకనిరోధక శక్తిగా పనిచేస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
ఉగాది పండుగ నాటికి కాసే మామిడికాయ కూడా ఇందులో వాడుతారు. మామిడి కాయల్లో డీహైడ్రేషన్‌ తగ్గించే గొప్ప గుణం ఉన్నది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా పుష్కలమైన ఫైబర్‌ కూడా ఉన్నది. విటమిన్‌ ఎ,సి,ఇ గుణాలు ఇందులో ఉన్నవి. అలాగే కొలెస్ట్రాలను తగ్గించడంలో కూడా గొప్ప సహాయకారిగా ఉంటుంది.
ఇందులో వాడే చింతపండులో విటమిన్‌ సి తో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్‌ జీర్ణక్రియను సరిచేసే ఔషధ గుణాలు వున్నాయి.
ఇక ఉప్పు గురించి అందరికీ తెలిసిందే. ఉప్పు అనేక రకాలుగా మానవ ఆరోగ్యానికి సహాయకారిగా ఉంటుంది. గొంతు నొప్పిలో ఇది ఉపయోగకారి. డిహైడ్రేషన్‌ తగ్గించే గుణం దీనికి ఉన్నది. శారీరక నొప్పులు వాపులను తగ్గిస్తుంది. చర్మ సమస్యలకు చక్కటి ఔషధం కూడా. శరీరానికి మినరల్స్‌ అందించడంలో దీని పాత్ర గొప్పది.
ఉగాది పండుగలో ఈ పచ్చడి సాంప్రదాయ అప్పటివారు శాస్త్రీయ దష్టితో ఆలోచించి పెట్టారా లేదా ప్రకతిలో అందుబాటులో ఉన్న పదార్థాలతో పండుగ ప్రసాదాన్ని తయారు చేసుకోవాలని అనుకున్నారా అనే చర్చను పక్కన పెడితే ఇప్పుడున్న సైన్స్‌ దష్టిలో చూసినప్పుడు, ఇందులో వాడే వస్తువులన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల ఈ ఉగాది పచ్చడి వాడడం వల్ల ఎలాంటి నష్టం లేదని గుర్తించాలి. పైగా ఎంతో కొంత శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలే కాబట్టి నిరభ్యంతరంగా అందరూ వాడుకోవచ్చు. అందరూ ఆనంద, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ… అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

సీహెచ్‌. ఉషారాణి 9441228142

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -