Friday, March 20, 2026
E-PAPER
Homeబీజినెస్హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విభేదాలు..!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విభేదాలు..!

- Advertisement -

చైర్మెన్‌ చక్రవర్తి అనుహ్య రాజీనామా
కుప్పకూలిన షేర్‌


ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌లో విభేదాలు తలెత్తాయి. ఆ బ్యాంక్‌ చైర్మన్‌ అతాన్‌ చక్రవర్తి ఆకస్మిక రాజీనామాకు మేనేజ్‌మెంట్‌తో ఉన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. తన రాజీనామా లేఖలో ఆయన విలువలు, నైతికత విషయంలో గత రెండేండ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తోన్నాయని బాంబ్‌ పేల్చారు. పలు సంఘటలను, ధోరణులను అంగీకరించలేకపోతున్నానని చక్రవర్తి పేర్కొన్నారు. ఇది బ్యాంకింగ్‌, స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంకులో గవర్నెన్స్‌ సమస్యలు ఉన్నాయనే ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా షేర్లను విక్రయించారు. ఇంట్రాడేలో ఆ బ్యాంక్‌ షేర్‌ 9 శాతం మేర క్షీణించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ లక్ష కోట్లు పైగా తుడుచుకుపెట్టుకుపోయింది.

తుదకు బీఎస్‌ఈలో 5.13 శాతం పతనంతో రూ.799.70కు పడిపోయింది. ఇంట్రాడేలో రూ.772 కనిష్ట స్థాయిని తాకింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. బ్యాంకులో ఎటువంటి అధికార పోరాటాలు లేవని తాత్కాలిక చైర్మెన్‌ కెకె మిస్త్రీ పేర్కొన్నారు. చైర్మన్‌, మేనేజ్‌మెంట్‌ మధ్య వ్యక్తిగత సంబంధాల పరంగా వచ్చిన ఇబ్బందుల వల్లే ఈ రాజీనామా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. దీనికి బ్యాంకు పనితీరుతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మాక్వారీ గవర్నెన్స్‌ ఆందోళనల దృష్ట్యా తన ‘మర్క్యూ బై లిస్ట్‌’ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును తొలగించడం గమనార్హం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఆర్థిక స్థితిగతులు పటిష్టంగా ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. గవర్నెన్స్‌ పరంగా ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైన అంశాలు తమ రికార్డుల్లో లేవని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -