బాల్యాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చేది ఆ వయసులో చేసిన పనులే. అవే పిల్లలకి జీవిత విలువలు, నడవడికను నేర్పించడంతో పాటు అంతులేని ఆనందాల్ని ఇస్తాయనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. అంతేకాదు ఇవే తర్వాత కాలంలో బలమైన బంధాలు ఏర్పడడానికీ బాటలు వేస్తాయి. మరి అలాంటి జ్ఞాపకాలు నేటి పిల్లలకు అందుతున్నాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. టెక్నాలజీ పెరిగి చిన్నా పెద్దా అందరూ స్క్రీన్లకు అతుక్కు పోతున్న ఈ రోజుల్లో ఇలాంటివి ఆశించడం అత్యాశే అనిపిస్తుంది. అయితే తల్లిదండ్రులు తలచుకుంటే మాత్రం ఇది సాధ్యమే. కనుక ఆ అందమైన అనుభూతులు పిల్లలకు అందించాలంటే తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి.
సరాదాగా బయటకు వెళ్లడమంటే పిల్లలకు చాలా ఇష్టం. అందులోనూ పిక్నిక్, పార్క్ వంటివి పిల్లలు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటివి ప్లాన్ చేయండి. పిక్నిక్ అంటే ఎప్పుడో ఒకసారి వెళుతుంటారు. అయితే ప్రతి రోజూ ఓపిక చేసుకొని సాయంత్రం పూట ఓ గంటైనా వారిని అలా చల్లగాలికి తీసుకు వెళ్లండి. ప్రకృతిలో హాయిగా ఆడుకునేలా ప్రోత్సహిచండి. అలాగే కుటుంబమంతా కలిసి వీక్ ఎండ్‌లో ఓ ‘మ్యాజిక్ నైట్’ను ఏర్పాటు చేసుకోండి. అంటే డిమ్ లైట్లలో పైజమాలు ధరించి, సరదాగా నచ్చినవి తింటూ కథలు చెప్పుకోవడం. ఇలా వారానికి ఒక్కసారి పిల్లలతో చేయగలిగినా వారిలో సృజనాత్మకత, ఊహాశక్తి వంటివి పెరుగుతుంది. మీ స్నేహితులను, వారి పిల్లలను కూడా అందులో కలుపుకోండి. దీని వల్ల పిల్లల్లో మరింత ఉత్సాహం వస్తుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది.
ప్రతిరోజూ పిల్లలు పడుకునే ముందు ఊరికే జోకొట్టి నిద్ర పుచ్చడం కంటే ఆ రోజు వాళ్లకు స్కూల్లో ఎలా గడిచింది? సరదా సంగతులేమైనా ఉన్నాయా? లంచ్ టైమ్‌లో ఎలా ఎంజారు చేశావు లాంటి విషయాలు అడగండి. ఇలాంటి విషయాలు వారి మనసులోని రకరకాల భావాలను బయటపెట్టే అవకాశం ఉంటుంది. ఇలా పిల్లలు విషయాలు పంచుకోవడం వల్ల వాళ్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా పెరగడంతో పాటు కృతజ్ఞతాభావమూ పెరుగుతుంది.
రెండు లేదా మూడు నెలలకోసారైనా రొటీన్‌కు భిన్నంగా గడిపేలా ఓ రోజును కేటాయించుకోండి. అంటే వెనకకు నడవడం, వాక్యాలు రివర్స్‌లో చదవడం, దుస్తులు తిప్పి వేసుకోవడం ఇలా సరదాగా పిల్లలతో చేయించండి. వారితో పాటు ఇవి తల్లిదండ్రులు కూడా చేస్తే పిల్లలకూ సరదాగా అనిపిస్తుంది. ఇవన్నీ పిల్లల్లో క్రియేటివిటీ, సమయస్ఫూర్తి, చతురతలను పెంచుతాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఈ పనులన్నింటినీ ఫొటోలు, వీడియోలు తీసుకోండి. అవే తర్వాత పిల్లలకు మంచి జ్ఞాపకాల్లా అనిపిస్తాయి.
‘ఐస్‌క్రీమ్ కొనిస్తావా అమ్మా’ అని పిల్లలు అడిగినప్పుడు మీరు ఎస్ చెప్తే వాళ్లు ఎగిరి గంతేస్తారు కదా! ఒక్క ఐస్‌క్రీం విషయంలోనే పిల్లలు అంత సంతోషిస్తే ఇక ఓ రోజంతా వాళ్లకు నచ్చినట్లే చేస్తే ఇంకెంత సంతోషిస్తారో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అప్పుడప్పుడూ ఒక రోజులో ఏమేం చేయాలో పిల్లలనే ప్లాన్ చేయమని చెప్పండి. అంటే ఆ రోజు తినే తిండి, డ్రెస్ కోడ్, యాక్టివిటీలు, నచ్చిన చోటుకి వెళ్లడం లాంటి వాటన్నింటికీ మీరు యస్ చెప్పాలన్నమాట! వారిలో ఫ్లానింగ్ స్కిల్స్ పెరగడానికి, కొత్త కొత్త ఆలోచనలు రావడానికి ఇలాంటి అలవాట్లు దోహదపడతాయి. అంతేకాదు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా అలవాటుపడుతుంది.
రొటీన్‌కి భిన్నంగా
- Advertisement -
- Advertisement -