– చిన్న కారణాలతోనూ అప్పీలుకు
– దిగువ కోర్టుల ఆదేశాలు సవాలు చేస్తూ పిటిషన్లు
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఫ్యామిలీ కోర్టు నుంచి బెయిల్ కోర్టు వరకు వేర్వేరు అవతారాలను తీసుకోవాల్సి వస్తున్నదని అన్నారు. చిన్న కారణాలతో కూడా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటారని తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించాల్సిన కేసులు ఆ విషయాన్ని అరుదుగానే పొందుతాయన్నారు. దిగువ కోర్టుల ప్రతి దశ, ఆదేశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు నిండిపోయాయి. ”హైకోర్టులు తిరిగి పంపబడిన కేసులు మళ్లీ సుప్రీంకోర్టుకు తిరిగి వస్తాయి. దిగువ కోర్టులు ఇచ్చే వాయిదాలు, వాదనలలో సవరణలను అనుమతించటం కోసం ఇంప్లీడ్మెంట్లకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవు తాయి” అని ఆమె అన్నారు. సుప్రీంకోర్టుకు భారీగా కేసులు రావటం వల్ల అసలు దృష్టి, ఉద్దేశం నీరుగారిపోతున్నదని తెలిపారు. ”మాకు ఫ్యామిలీ కోర్టు, ట్రయల్ కోర్టు, బెయిల్ కోర్టు, హైకోర్టు ఇలా అనేక అవతారాలున్నాయి. ప్రతి ఒక్కదానికీ.. ఇక్కడి పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటన్నిటిలో, ఒక సుప్రీంకోర్టుగా మా న్యాయపరిది ఎక్కడున్నది?” అని జస్టిస్ నాగరత్న తెలిపారు. కాగా, సీనియారిటీ పరంగా చూస్తే.. నాగరత్న భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాలలో హైకోర్టులను తుది కోర్టుగా మార్చాల్సినవసరం ఉన్నదని ఆమె చెప్పారు. అందరూ న్యాయం పొందటం సమ్మతమే అయినా.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి ముందు విచక్షణ అవసరమనీ, ఇది కోర్టు పని తీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా సుప్రీం, హైకోర్టులతో పాటు దిగువ న్యాయస్థానాల్లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సుప్రీంకోర్టుకు వేర్వేరు అవతారాలు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES