– తలుపులు మూస్తున్న థియేటర్లు
– అంతర్జాతీయ వేదికలపై అవార్డులు..
– దేశంలో మాత్రం స్క్రీన్లు కరువు
– బాక్స్ ఆఫీస్ బానిసలుగానే ఓటీటీలు
– ప్రత్యామ్నాయ స్క్రీనింగ్ మార్గాలు అవసరమంటున్న విశ్లేషకులు
భారతీయ ఇండిపెండెంట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. కానీ అదే సినిమా భారతీయ థియేటర్లలో చోటు సంపాదించేందుకు మాత్రం తీవ్రంగా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మల్టీప్లెక్సుల వ్యాపార విధానం ఇండిపెండెంట్ సినిమాలకు తలుపులు మూసేస్తోంది. మల్టీప్లెక్సులు ఈ సినిమాలు ఎక్కువ కాలం ఆడకుండా, ఆ షోలను సులభంగా రద్దు చేస్తాయి. దీంతో ప్రేక్షకులకు ఆ సినిమాలను చూడటానికి అవకాశం ఉండటం లేదు. ఇక ఓటీటీలు బాక్సాఫీస్ నెంబర్ల మీద ఆధారపడుతూ వాటికి బానిసలుగా మారాయి. ఇలాంటి చిత్రాలను దూరం పెడుతున్నాయి. దీంతో ఈ చిత్రాల దర్శకులు, నిర్మాతలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక సమస్యగా పరిణమించిన ఈ పరిస్థితి సినిమా వైవిధ్యాన్ని చెడగొడుతోంది. భారత ప్రేక్షకులు స్వతంత్ర సినీ స్వరాన్ని వినాలంటే కొత్త మార్గాలు అవసరమని విశ్లేషకులు చెప్తున్నారు.
న్యూఢిల్లీ : భారతీయ ఇండిపెండెంట్ సినిమా విదేశీ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విజయాలు సాధిస్తున్నా… భారత థియేటర్లలో ప్రదర్శనకు మాత్రం వాటికి సరైన అవకాశం లభించటం లేదు. మల్టీప్లెక్స్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, బాక్సాఫీస్ ఒత్తిళ్లు వంటి వాస్తవ పరిస్థితులు స్వతంత్ర సినిమా దర్శకులకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితిపై సదరు చిత్రాల దర్శకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. వారు ఇప్పటికే ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. స్వతంత్ర చిత్రాలు కేన్స్, బెర్లిన్, వెనిస్ వంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందినప్పటికీ.. భారత్‌లోని మల్టీప్లెక్స్‌లు వీటికి తగిన షోలు ఇవ్వడం లేదు. ఉదాహరణకు, కాను బేV్‌ా్ల దర్శకత్వంలో వచ్చిన ఆగ్రా సినిమా కేన్స్ ప్రీమియర్ తర్వాత రెండు ఏండ్లు డిస్ట్రిబ్యూషన్ కోసం ఎదురు చూసింది. చివరికి థియేటర్లలోకి వచ్చినప్పటికీ.. కొన్ని షోలకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి భారతీయ ఇండింపెండెంట్ ఫిల్మ్‌లకు ఇబ్బందికరంగా మారింది.
మల్టీప్లెక్స్‌లు, ఓటీటీలపై ఆశలు పెరిగినా..
1990ల చివర మల్టీప్లెక్స్‌ల రాకతో స్వతంత్ర సినిమాలకు కొత్త అవకాశాలు వచ్చి, చిన్న స్క్రీన్లను ఇస్తారనే ఆశ చిత్ర నిర్మాతల్లో ఏర్పడింది. కానీ ప్రస్తుతమున్న వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగానే ఉన్నది. ఇండిపెండెంట్ సినిమాలపై మల్టీప్లెక్సులు చూపించే నిర్లక్ష్యం, అసౌకర్యమైన షో టైమింగ్‌లు, ముందస్తు సమాచారం లేకుండానే షోలు రద్దు చేయడం, సినిమాలను రెండు మూడు రోజుల్లోనే తొలగించటం వంటి సమస్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. మల్లీప్లెక్సులు చిన్న స్క్రీన్లను కూడా పెద్ద సినిమాలకు ఇచ్చేస్తున్నాయి. ప్రేక్షకుల స్పందన కోసం ఇండిపెండెంట్ సినిమాలకు సమయం ఇవ్వడం లేదు. ఇక 2010 తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు స్వతంత్ర సినిమాలకు పెద్ద వేదికగా మారాయి. కానీ ఇప్పుడు అవి కూడా బాక్సాఫీసు నెంబర్లను ఆధారంగా చేసుకుంటున్నాయి. ఇండిపెండెంట్ సినిమాలను థియేటర్లలో విడుదలయ్యాకే కొనుగోలు చేయాలనుకుంటున్నాయి. దాంతో స్వతంత్ర దర్శకులు తిరిగి థియేటర్ వ్యవస్థనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రేక్షకుల ఆలోచనా తీరులో మార్పు
సినిమా ఫెస్టివల్స్, ఫిల్మ్ క్లబ్‌లు, స్పెషల్ స్క్రీనింగ్‌లలో స్వతంత్ర సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. అక్కడ సీట్లన్నీ క్షణాల్లో నిండిపోతాయి. ప్రజలు ముందుగానే వచ్చి కూర్చుంటారు. కానీ ఇదే ప్రేక్షకులు థియేటర్‌లో వచ్చిన స్వతంత్ర సినిమాకు అదే ఉత్సాహం చూపించడం లేదు. తక్షణమే వెళ్లి చూడాలన్న అవసరం లేకపోవడం, అసౌకర్యమైన షో టైమింగ్‌లు, ఓటీటీలో వస్తుంది కదా అనే ఆలోచనలు వంటివి ఇందుకు కారణాలవుతున్నాయి.
కొత్త మార్గాలను అన్వేషించాలి
స్వతంత్ర సినిమా థియేటర్లలో నిలబడకపోవడం కొత్త విషయం కాదు. అయితే దీన్ని అధిగమించడానికి తీసుకోవల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లకు ప్రత్యామ్నాయాలుగా కొత్త ప్రదర్శన వేదికలు నిర్మించాలని అంటున్నారు. భారతీయ ఇండిపెండెంట్ సినిమా.. మల్టీప్లెక్స్‌లపై ఆధారపడటం ప్రమాదకరమని చెప్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఆర్ట్-హౌస్ థియేటర్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సాంస్కృతిక కేంద్రాలు, ఫిల్మ్ సొసైటీలు, ఆర్ట్ ఇన్‌స్టిట్యూషన్లు వంటివి వేదికలను తీసుకురావాలని సూచిస్తున్నారు. ఇక మంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకూ విస్తరించాలని చెప్తున్నారు. మొత్తంగా భారతీయ స్వతంత్ర సినిమాలు ప్రపంచానికి మన సంస్కృతిని, కథాశైలి వైవిధ్యాన్ని చూపించాయి. ఇప్పుడు అవే సినిమాలు ఆదరణకు నోచుకోక దీనస్థితిలో ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి సినిమాలకు ఆదరణ పెరగాలనీ, ప్రేక్షకులు థియేటర్‌లో చూడగలిగే విధంగా వ్యవస్థ మారాలని నిపుణులు అంటున్నారు.
ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే?
ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే పెద్ద స్టూడియోలు, డబ్బు, వారి మార్కెటింగ్ బలం, వారి క్రియేటివ్ కంట్రోల్ లేకుండా.. దర్శకుడు, రచయిత, నిర్మాతలు సొంత దారిలో తీసే సినిమా. ఇలాంటి సినిమాలు చాలా సార్లు చిన్న బడ్జెట్, కొత్త నటులు, కథలు, పచ్చి నిజాలతో కూడుకున్నవై ఉంటాయి. ప్రమాదం ఉన్నా.. ప్రయోగా నికి ధైర్యం చేస్తాయి. స్టూడియో సినిమాలు పెద్ద మార్కెట్ల కోసం తయారైతే.. ఇండిపెండెంట్ చిత్రాలు మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా ఉంటాయి.
ఇండిపెండెంట్ సినిమాకు కష్టాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



