చోద్యం చూస్తున్న అధికారులు
తమ అవసరాలకే అంటున్న గ్రామస్థులు
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని సింగర్ రావుపేట శివారులో గల గుట్టను ఏలాంటి అనుమతులు లేకుండా జెసిబితో తవ్వుతూ..ట్రాక్టర్ల ద్వారా ప్రధాన రహదారిపై నుండి మొరంను తరలిస్తున్నా అధికారుల చూపు మాత్రం ఆవైపు పడటం లేదు. కొందరు జేసీబీ వ్యాపారస్తులు గ్రామస్తులను మచ్చిక చేసుకొని గ్రామస్తుల అవసరాల కోసమే గుట్టను తవ్వుతూ..అక్రమంగా అందినకాడికి సహజ సంపదను దోచుకుంటున్నారని స్థానికులు తెలిపారు. నవతెలంగాణకు ఓ గ్రామస్తుడు ఫోన్ చేసి ఇతర గ్రామాలకు కాకుండా,గ్రామస్తుల అవసరాల మేరకు తీర్మానం చేసుకొని మొరం గ్రామస్తుల కోసమే ఒక్కో ట్రిప్పుకు రూ.400 పోసుకుంటున్నామని తెలిపాడు. ఏదైనా ఉంటె జేసీబీ యజమానితో మాట్లాడుకోండని ఉచిత సలహా సైతం ఇవ్వడం కొసమెరుపు. అయితే గత సంవత్సరం గ్రామంలోని స్థానిక చెరువులో కూడా జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ…అక్రమంగా మట్టిని తరలించారు. విషయం తెల్సుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకోగా జేసీబీ వ్యాపారస్తులు పలువురు నాయకులను అడ్డం పెట్టుకొని గ్రామ అవసరాలకు వాడుకుంటున్నామని తెలపడంతో అధికారులు సైతం ఏలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు అక్రమార్కుల కండ్లు గ్రామ శివారులోని గుట్టపై పడటంతో..అధికారులు స్పందించకపోతే సహజ సంపద కొద్దీ రోజుల్లో మాయం అవుతుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. అయితే మండలంలోని గ్రామాల్లో గుట్టలు మాయం అవుతున్నా…పలు గ్రామాల్లోని చెరువులను, కుంటలను జేసీబీలతో తోడేస్తున్నా…అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
గుట్టను తవ్వుతూ..అక్రమంగా మొర్రం తరలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES