ఇది డిజిటల్ యుగం. ఇంటర్నెట్, మొబైల్, కంప్యూటర్… వంటి పదాలు పిల్లలకీ సుపరిచితమే. ప్రపంచమూ ఏఐ సహా ఎన్నో నూతన సాంకేతికతల వైపు పరుగుతీస్తోంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్ పరిచయం లేని వారున్నారంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. అందులోనూ మహిళల సంఖ్యే ఎక్కువ. లాక్‌డౌన్‌ని ఉదాహరణగా తీసుకుందాం. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా అందరం ఇంటికే పరిమితమయ్యాం. ఒకరకంగా చెప్పాలంటే దేశమంతా స్తంభించిపోయిన సందర్భమది. పనుల్లేవు, పాఠాల్లేవు. ఆన్‌లైన్ బోధన తెరమీదకొచ్చినా చదువులో ఏడాది వెనకబడ్డ వారిలో అమ్మాయిలే ఎక్కువ. కారణం వారికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడం. ఉన్నా దానికి ఇంటర్నెట్ సౌకర్యం, దాన్ని ఎలా వాడాలన్న అవగాహన కరవయ్యాయి. అబ్బాయిలు అసల్లేరా అంటే ఉన్నా ఎక్కువ శాతం మంది మాత్రం అమ్మాయిలే.
కంటార్, ఐఏఎంఏఐ సంయుక్త అధ్యయనం ప్రకారం దేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న మహిళల సంఖ్య 47 శాతం మాత్రమే. జీఎస్‌ఎంఏ మొబైల్ జెండర్ గ్యాప్-2025 ప్రకారం ఫోన్లున్న మహిళల సంఖ్య 71 శాతమైతే అందులోనూ స్మార్ట్‌ఫోన్లు వాడేది తిరిగి 36 శాతమే అంటున్నారు. మగవారి సంఖ్య ఈ విషయంలో వరుసగా 84 శాతం, 58 శాతంగా ఉంది. అసలు స్మార్ట్‌ఫోన్ వాడకంలో జెండర్ గ్యాప్ ఎందుకుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ‘అమ్మాయిలకు ఫోనెందుకు?’ సాధారణంగా ఈ ప్రశ్నే మహిళలను డిజిటల్ ప్రపంచలో వెనకబడేలా చేస్తోంది. ఇంట్లో ఫోన్ ఉన్నా, తనకే నేరుగా కొనిచ్చినా కూడా దాని మీద అజమాయిషీ మొత్తం మగవాళ్లకే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఫోన్లు ఎక్కువగా వాడితే పెళ్లయినా, కాకపోయినా అమ్మాయికి చెడ్డపేరు వస్తుందన్న భావన చాలా మందిలో ఉంది. అందుకే ఫోన్ వాడకంపై పరిమితులు, నలుగురూ ఉన్న చోట మాట్లాడనివ్వకపోవడం, సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఇది కేవలం పల్లె ప్రాంతాలకే పరిమితం కావడం లేదు. అభివృద్ధి చెందిన నగరాలు, పట్టణాల్లోనూ చాలా మంది అమ్మాయిలకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి ఆలోచన వల్ల దేశంలో ‘డిజిటల్ గ్యాప్’ పెరిగిపోతోంది.
అయితే డిజిటల్ ప్రపంచంలో అన్నీ ఇబ్బందులే. మానసిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అలాంటప్పుడు దీనికి దూరంగా ఉండడం మంచిదేకదా అనుకోవడానికి వీల్లేదు. మన చుట్టూ ఉన్న నలుగురిని దాటి ప్రపంచాన్ని తెలుసుకునే వేదిక ఇంటర్నెట్. ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, కావాల్సిన నైపుణ్యాలు, కొత్త కోర్సులు, ఉద్యోగవకాశాలు, మార్కెట్ పోకడలు, డిజిటల్ ప్రెజెంటేషన్లు వంటివన్నీ స్మార్ట్‌ఫోన్‌తోనే సాధ్యం. నేర్చుకోవడానికీ, సృజనాత్మకత పెంచుకోవడానికి ఇదే మెరుగైన మార్గం కూడా. అలాంటి డిజిటల్ ప్రపంచానికి దూరమవుతన్నారంటే అన్నింటా వెనకబడుతన్నట్టే. మోసాలు, వేధింపుల నుంచి బయటపడాలన్నా, ఆత్మరక్షణ విషయంలోనూ సాంకేతికత ఓనమాలు తెలుసుండటం అవసరమే. ఇప్పుడు అన్నీ డిజిటల్ చెల్లింపులే. దానిమీద అవగాహన లేకపోతే ఒక సాదా మహిళా వ్యాపారవేత్త తన వ్యాపారాన్ని గ్రామాన్ని దాటించగలదా? అవకాశాలను అందిపుచ్చుకోగలదా? తన కుటుంబ స్థితిగతులను మార్చుకోగలదా? ఇవన్నీ సాధ్యం కావాలంటే డిజిటల్ గ్యాప్ తగ్గాల్సిందే. మహిళలూ కలిసికట్టుగా నడవాల్సిందే. ఎందుకంటే ఆర్థికంగా దేశం దూసుకెళ్లడంలో ఆమెదీ సమాన వాటా వుందనే విషయం మర్చిపోవద్దు.
డిజిటల్ గ్యాప్
- Advertisement -
- Advertisement -