Sunday, October 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటర్‌ విద్యలో డిజిటల్‌ విప్లవం

ఇంటర్‌ విద్యలో డిజిటల్‌ విప్లవం

- Advertisement -

ప్రభుత్వ కాలేజీల్లో జవాబుదారీతనం పెంచేందుకు సాంకేతికత వినియోగం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ విద్యలో డిజిటల్‌ విప్లవం ప్రారంభమైందని ఎస్సీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆయన సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాణ్యత, జవాబుదారీతనం పెంచేందుకు ఇంటర్‌ బోర్డు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా ఉపయోగించిందని వివరించారు. పేద, అణగారిన వర్గాలకు చెందిన యువతకు ఉత్తమ నాణ్యత గల విద్య అందించాలనే సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పాన్ని మంత్రి గుర్తు చేశారు. గురుకులాలు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఆధునిక సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు, డిజిటల్‌ అభ్యాస అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇంటర్‌ బోర్డులో డిజిటల్‌ వ్యవస్థలో సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ, ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌), మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్‌ఆర్‌ఎంఎస్‌) ఉన్నాయని వివరించారు.

పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయని చెప్పారు. రోజూ వాట్సాప్‌ ద్వారా విద్యార్థుల హాజర, క్రమశిక్షణను పెంచేందుకు తల్లిదండ్రులకు పంపిస్తున్నారని అన్నారు. ఏవీఆర్‌ఎస్‌ ఫిర్యాదుల పరిష్కారం కోసం విద్యార్థుల సమస్యలను సులభంగా నమోదు చేసుకుని పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సీసీటీవీ కెమెరాలు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ఉపయోగించి అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సకాలంలో పర్యవేక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు సీసీటీవీ కెమెరాలతో అనుసంధానం చేశామన్నారు. మొత్తం 1,61,233 మంది విద్యార్థులుంటే 1,44,530 మంది ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలో నమోదు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థుల హాజరు, పురోగతి పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీవోఈ జయప్రదబాయి, జాయింట్‌ డైరెక్టర్లు భీంసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -