Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం3.25 లక్షల మందికి డిజిటల్‌ సేవలు

3.25 లక్షల మందికి డిజిటల్‌ సేవలు

- Advertisement -

సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న వాట్సాప్‌ మీసేవ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్‌ మీసేవ విధానం ద్వారా ఇప్పటివరకు 3.25 లక్షల మంది డిజిటల్‌ సేవలు అందుకున్నారని సీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2025 నవంబర్‌ 18న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ వాట్సాప్‌ మీసేవ సర్వీసును ప్రారంభించారు. వాట్సాప్‌ సేవలతో ఆశించిన మేరకు పౌర సేవలు వేగం పుంజుకోవటంతో పాటు దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరింత చేరువైంది. 4.5 లక్షల మంది వివిధ పౌర సేవలకు వాట్సాప్‌ మీసేవలో నమోదు చేసుకోగా.. వారిలో 3.25 లక్షల మంది సేవలను పొందారు. రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్‌ మీసేవా 8096958096 అనే వాట్సాప్‌ నంబర్‌ ద్వారా నిర్విరామంగా 24 గంటల పాటు పౌర సేవలు అందుతున్నాయి.

వాట్సాప్‌ మీసేవ నుంచి మొత్తం పదికి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 వివిధ రకాల సేవలు రాష్ట్ర ప్రజలు పొందే అవకాశాన్ని కల్పించింది. ప్రధానంగా కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు పొందటం చాలా సులువైంది. ఎక్కువ మంది ఆదాయ సర్టిఫికెట్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, డెత్‌ సర్టిఫికెట్‌, రెసిడెన్సీ సర్టిఫికెట్‌, పోలీస్‌ చలాన్‌, రెన్యువల్‌ ఆఫ్‌ రేషన్‌ షాప్స్‌, టెంపుల్‌ సర్వీసెస్‌, బిల్డింగ్‌ పర్మిషన్‌, వెహికిల్‌ లైఫ్‌ ట్యాక్స్‌, లైసెన్స్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ సేవలు వాట్సాప్‌లోనే పొందొచ్చు. మీ-సేవ సర్టిఫికెట్ల స్టేటస్‌, తాజా అప్‌ డేట్స్‌ కూడా వాట్సాప్లోనే తెలుసుకోవటం, ఆమోదం పొందిన సర్టిఫికెట్లు డౌన్లోడ్‌ చేసుకునే అవకాశం ఉండటంతో పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గింది. దరఖాస్తుదారులు ప్రశ్నలు అడగడానికి, సేవలకు దరఖాస్తు చేసుకోవడానికి, చెల్లింపులు చేయడానికి లేదా వారి దరఖాస్తుల స్థితిని తనిఖీ చేయడానికి సందేశం పంపి… సంబంధిత సేవను నేరుగా పొందవచ్చు.

ఈ సంభాషణ దరఖాస్తుదారుడికి సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తుంది. వాట్సాప్‌ మీసేవ ద్వారా రాష్ట్రంలో 31 దేవాలయాలకు సంబంధించిన సేవలను అందజేస్తున్నది. భక్తులు దర్శనం, వసతి తదితర సేవలు ఇందులోనే బుక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా మీసేవా కేంద్రాలు ప్రతిరోజూ 80 వేల మంది నుంచి లక్ష మందికి డిజిటల్‌ పౌర సేవలు అందిస్తున్నాయి. 2023 నవంబర్‌ ఒకటో తేదీ నుంచి 2026 జనవరి 31 వరకు మీసేవ ద్వారా 5.98 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ. 3,811 కోట్లు. మీ సేవ కేంద్రాలు, వాట్సాప్‌ మీసేవా విధానం ద్వారా అనవసరమైన మధ్యవర్తుల పాత్ర తొలిగిపోయి.. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గింది. సేవల్లో పారదర్శకత మెరుగుపడింది. పౌర సేవల పరిష్కారం వేగవంతమైంది.

రానున్న రోజుల్లో అత్యవసర సేవలకు…
రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సేవలను కూడా వాట్సాప్‌ మీసేవ ద్వారా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 108, 102, అగ్నిమాపక సేవలకు 101, ఎస్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌, ముఖ్యమైన హెల్ప్‌ లైన్‌ నెంబర్లన్నీ దీనికి లింక్‌ చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -