న్యూఢిల్లీ : భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో త్వరలోనే ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల పునరుద్దరణ చోటు చేసుకోనుందని తెలుస్తోంది. కరోనా సమయంలో 2020 నుంచి రెండు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవల చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి భారత్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పలు వాణిజ్య అంశాలపై ఇరు దేశాల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. అందులో విమానయానానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి భారతీయ విమానయాన సంస్థలతో పాటు చైనా విమానయాన సంస్థలు ఇరు దేశాల రాకపోకలకు సంబంధించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయి. భారత్, చైనా మధ్య ప్రత్యక్ష విమానాల లేకపోవడం వల్ల ఇరు దేశాల విమానయాన సంస్థలు ప్రయాణీకుల డిమాండ్‌ను కోల్పోతున్నాయి. దీంతో ఆగేయ ఆసియా దేశాల విమానయాన సంస్థలు లాభపడుతున్నాయి.. ఇప్పుడు వీసా సౌలభ్యం, ద్వైపాక్షిక ఒప్పందాలతో ఈ మార్గంలో ప్రయాణ సమయం, ఖర్చు తగ్గనుంది. తద్వారా రెండు దేశాల విమానయాన సంస్థలకు లాభదాయక అవకాశాలు పెరగనున్నాయి.