Thursday, November 13, 2025
E-PAPER

దిశ-దశ..

- Advertisement -

ఇటు పార్టీ.. అటు ప్రభుత్వంపై దృష్టి
రెండింటినీ మరింత బలోపేతం చేయాలి
స్థానికం..సంస్థాగతంపై కేంద్రీకరించాలి
నామినేటెడ్‌ పదవులు, డీసీసీల భర్తీకి ప్రణాళికలు : సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం
పీసీసీ చీఫ్‌తో సమన్వయం
ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, నేడు హస్తినకు పీసీసీ చీఫ్‌
యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశానికి హాజరుకానున్న సీఎం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి కావస్తోన్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు మరో మూడేండ్ల సమయముంది కాబట్టి ఈలోగా ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన మార్గదర్శనం చేసినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో మరింత సమన్వయం చేసుకోవటం ద్వారా జిల్లాల్లో పార్టీని పటిష్టం చేయాలనే సంకేతాలను ఆయన ఇచ్చారు. క్యాడర్‌లో జోష్‌ నింపడం కోసం 2034 వరకూ అధికారంలో ఉంటామంటూ సీఎం, పీసీసీ చీఫ్‌ ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో అందుకనుగుణంగా వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలంటూ ఆయన ఆదేశించారు.

ఇందులో భాగంగా తొలుత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవటం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ జమానా మాదిరిగా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నది సీఎం యోచన. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున…దానిపై ఎప్పుడు విచారణ కొనసాగినా, ’50 శాతానికి మించకుండానే రిజర్వేషన్లను అమలు చేస్తాం…’ అని న్యాయస్థానానికి చెప్పి, ఒప్పించాలని ఆయన భావిస్తున్నారు. ఆ రకంగా కోర్టు అనుమతి తీసుకుని, గత బీఆర్‌ఎస్‌ సర్కారు బీసీలకు అమలు చేసిన 23 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూనే, మిగతా 19 శాతాన్ని (బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే హామీ మేరకు) కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇవ్వటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలన్నది వ్యూహంగా కనబడుతున్నది. తద్వారా స్థానిక ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని సీఎం ఆశిస్తున్నారు.

ఇక పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు వీలుగా తొలుత జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ)లకు అధ్యక్షులను నియమించను న్నారు. జిల్లాల్లో, ప్రజల్లో పట్టుండి, పార్టీని సమర్థవంతంగా నడిపించగల యువ నాయకత్వాన్ని డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని సీఎం, పీసీసీ చీఫ్‌ ఇప్పటికే నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి సైతం తెలిపినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకుని, క్రియాశీలకంగా పనిచేసిన కీలక నేతలను నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చి, సంతృప్తి పరచాలని హస్తం పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరిన తర్వాత ఆర్నెల్లపాటు పార్లమెంటు ఎన్నికలపైన్నే దృష్టి సారించారు. ఆ తర్వాత కొన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేశారు. ఇంకా 40 నుంచి 50 దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ పార్టీకి విధేయులైన, అర్హులైన వారితో భర్తీ చేయటం ద్వారా ‘కష్టపడే వారిని తప్పకుండా గుర్తించి, గౌరవిస్తాం…’ అనే సంకేతాలను కిందిస్థాయి క్యాడర్‌కు ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయిం చింది. ఇలాంటి అంశాలన్నింటిపై చర్చించి, అధిష్టానం వద్ద అనుమతి తీసుకోవాలని సీఎం, పీసీసీ చీఫ్‌ నిర్ణయించారు.

‘యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం’ సమావేశానికి హాజరుకావటానికి సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా గురువారం ఉదయం హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురూ కాంగ్రెస్‌ అధిష్టానంతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, ఆ ఎలక్షన్‌ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా పని చేసిన తీరు తదితరాంశాలను వారు హైకమాండ్‌ దృష్టికి తీసుకుపోనున్నారని సమాచారం. వీలైతే పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కలవనున్నారు. అయితే ఇప్పటి వరకూ అపాయింట్‌మెంట్ల సమాచారమేమీ లేదని సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. గురువారం రాత్రికి రేవంత్‌, మహేశ్‌ ఇద్దరూ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మరోసారి వారిద్దరూ ఢిల్లీ అవకాశాలున్నాయని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -