Tuesday, May 20, 2025
Homeమానవివైక‌ల్య‌మే చిన‌బోయింది

వైక‌ల్య‌మే చిన‌బోయింది

- Advertisement -

ఆరోగ్యంగా ఉంచాల్సిన మందులే వికటించి ఇద్దరు బిడ్డలకు అంగవైకల్యాన్ని మిగిల్చింది. వారిని బాగు చేసుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు వర్ణనాతీతం. ఎన్నో ప్రయత్నాల ఫలితంగా చివరకు పెద్ద కూతురు కాస్త లేచి నిలబడగలిగింది. నిలబడటమే కాదు ఇప్పుడు విజయపథంలో దూసుకుపోతుంది. అంగవైకల్యాన్ని జయించి తనకు నచ్చిన రంగంలో రాణిస్తోంది. ఆమె విజయాలను చూసి వైకల్యమే చినబోయింది. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమే డాక్టర్‌ దుర్గేశ్‌ నందిని…

దుర్గేష్‌ నందిని పూర్వీకులు ఎన్నో తరాల కిందట యు.పి.నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇంట్లో హిందీ మాట్లాడతారు. అమ్మా నాన్నలు శిరోమణి శ్రీవాస్తవ, ఎస్‌.ఎస్‌.కరణ్‌. వీరి తొలి సంతానం నందిని. ఈమె తెలుగు, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటమే కాదు కవితలు, వ్యాసాలు, కథలు రాయడంలో కూడా నిష్ణాతురాలు. ఈమె చెల్లెలు శ్రదేశ్‌ నందిని కూడా కవితలు, వ్యాసాలు రాస్తుంటారు. నిత్యం ఉత్సాహంతో తన బాధలను మర్చిపోయి ఇతరులతో ఎంతో సరదాగా, నవ్వుతూ, తుళ్లుతూ గలగల మాట్లాడడం దుర్గేష్‌ నందిని సొంతం.
పోలియో డ్రాప్స్‌ వికటించి
‘నాకు సుమారు ఏడాదిన్నర, చెల్లికి నాలుగు నెలల వయసు ఉన్నప్పుడు మా ఇద్దరికీ పోలియో డ్రాప్స్‌, డి.పి.టి.ఇంజక్షన్‌ ఇప్పించారు. వాటి రియాక్షన్‌తో నాకు ఎడమకాలు, చెల్లికి శరీరమంతా చచ్చుబడింది. ఆ సమయంలో మానాన్న ఆర్మీలో పని చేస్తున్నారు. అయినా మాకోసం అమ్మా నాన్నలు పడిన తిప్పలు అంతా ఇంతా కాదు. చూపని డాక్టర్లు, చేయని వైద్యం లేదు. పూణే, బెంగుళూర్‌తో పాటు ఇంకా ఎవరు ఏ సలహా ఇస్తే అలా మమ్మల్ని తిప్పారు. ఆయుర్వేదం, హోమియో చికిత్సలకు కూడా నేను కోలుకోలేకపోయాను. ఇలా ఎన్నో ప్రయత్నాల ఫలితంగా నాకు దాదాపు నయమైయ్యింది. దాంతో అమ్మానాన్నలకు కాస్త ఊరట కలిగింది. ఎన్నో మందులు వాడిన తర్వాత మహావీర్‌ హాస్పిటల్‌లో సర్జరీ చేశారు. హిమాయత్‌ నగర్‌లోని ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో చెల్లిని ఉంచారు. రోజూ సాయంత్రం ఇంటి నుంచి నన్ను రిక్షాలో తీసుకువెళ్లేవారు. అక్కడ చెల్లికి కేర్‌ టేకర్‌ ఉంది. కానీ నేనూ, చెల్లి భయంకరమైన బాధ అనుభవించాము. ఎవరితో చెప్పుకునేది? ఇప్పటికీ తల్చుకుంటే నాగుండె ఝల్లు మంటుంది. ఒక రోజు నేను అక్కడకు వద్దని మారాం చేశాను. ఆ రోజు మా నాన్నమ్మతో దెబ్బలు కూడా తిన్నాను. ఆ రోజు నేను నోరు విప్పి చెప్పడంతో మా ఇద్దరికీ ఆ నరకం నుండి విముక్తి దొరికింది’ అంటూ ఆమె తన ప్రారంభ రోజుల్లో పడ్డ బాధను పంచుకున్నారు.
ఇల్లే వాళ్లకు బడి
ఆరోగ్య సమస్యల రీత్యా దుర్గేష్‌కు ఇంట్లోనే అమ్మా, నానమ్మలు చదువు చెప్పేవారు. పరీక్షలు రాయడానికి మాత్రమే బడికి వెళ్లిందామె. ఎస్‌.ఎస్‌.సి పరీక్షను ప్రిన్సిపాల్‌ రూంలో కూర్చుని రాసేవాళ్లు. ఇంటర్మీడియేట్‌ హిందీ మీడియంలో చదవడం ఆమెకు ఓ కొత్త అనుభవం. థర్డ్‌ ఫ్లోర్‌లో జరిగే క్లాసులకు రోజూ తల్లి తీసుకెళ్లి దింపేది. నోట్సులు కూడా ఆమే రాసేది. సాయంత్రం రిక్షా అతను ఇంటికి తీసుకొచ్చేవాడు. క్లాస్‌ పిల్లలు, టీచర్లు ఆమెను ఎంతో ప్రోత్సాహించారు. గ్రాడ్యుయేషన్‌ ఇంగ్లీష్‌ మీడియంలో చేశారు. అక్క చెల్లెళ్లు ఇద్దరూ కాలేజీలో వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొన్ని బహుమతులు కూడా సాధించారు. దుర్గేష్‌ ఉస్మానియా యూనివర్శిటీలో పీజీ పూర్తి చేశారు.
పీహెచ్‌డీ వరకు…
పీజీ తర్వాత బీఈడీలో సీటు సంపాదించి అది కూడా పూర్తి చేశారు దుర్గేష్‌. బీఈడీ చేస్తూనే ఎంఫిల్‌ పరీక్షలు రాసి ఐదవ ర్యాంక్‌ సాధించారు. చదువుతోపాటు పార్ట్‌ టైంగా రెండు కాలేజీలలో పని చేసేవారు. తండ్రి సలహాతో డీఎస్సీ నోటిఫికేషన్‌ పడినప్పుడు అప్లై చేసి ఉత్తీర్ణత సాధించారు. కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అక్కడ చేరిన కొన్ని రోజులకే సెంట్రల్‌ యూనివర్సిటీలో హిందీలో పీహెచ్‌డీ అడ్మిషన్‌ దొరికింది. అదే సమయంలో ధీరేందర్‌ నాథ్‌ నిగంతో ఆమెకు పెండ్లి జరిగింది. అప్పటి నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు భర్త సహకారం కూడా ఆమెకు తోడయ్యింది. దాంతో తన చదువుని కొనసాగించారు. అలాగే దుర్గేష్‌కు మొదట బాబు పుట్టాడు. తర్వాత పాప పుట్టింది.
విజయానికి గుర్తులు
‘ఇంట్లో నా భర్త, పాప, అమ్మ, నా ఇద్దరు తమ్ముళ్లు, మరదలు నాకు ఎంతో హెల్ప్‌ చేస్తారు. ఎక్కడికైనా వెళ్లాలంటే నా కొడుకు తోడు ఉంటాడు. మా బాబు ఎం.టెక్‌. పూర్తి చేశాడు. అలాగే మా నాన్న స్నేహితుడు, ఆర్టీసీ ఉద్యోగి అయిన సయ్యద్‌ అమీన్‌ మహ్మద్‌ చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటారు ఆమె. అంగ వైకల్యం ఉన్నా అన్నింటినీ అధిగమించి ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా వచ్చిన రివార్డులు, అవార్డులు లెక్క లేనన్ని. సూపర్‌ ఉమన్‌, నారీసమ్మేళన్‌, గోల్డెన్‌, నంది, హిందీ శిరోమణి, అబ్దుల్‌ కలాం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లెర్నింగ్‌, శక్తి సమ్మాన్‌, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ఇలా ఎన్నో ఎన్నెన్నో. వికలాంగుల శక్తికి దర్పణంగా దుర్గేష్‌ నందిని చెప్పుకోవచ్చు. నేడు ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
అచ్యుతుని రాజ్యశ్రీ సాహిత్య రంగంలోనూ…
ఒక గృహిణిగా, ఒక ఉద్యోగిగా అన్ని బాధ్యతలూ చూస్తూనే తన జీవన గమ్యాన్ని విజయవంతంగా సాగించారు. అలాగే తెలంగాణ స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌గా పాఠ్యపుస్తకాల్లో, మాడ్యూల్స్‌, టి సాట్‌, దీక్షా పోర్టల్స్‌ లెసన్స్‌లో భాగస్వామి అయ్యారు. అంతేకాదు 2018లో పారిస్‌లో పేపర్‌ ప్రెసెంటేషన్‌ కూడా చేశారు. అలాగే స్విర్జర్లాండ్‌, ఇటలీ, నెదర్లాండ్‌ కూడా వెళ్లి వచ్చారు. అలాగే మారిషస్‌లో జరిగిన 11వ ప్రపంచ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఉద్యోగంతో పాటు తనకెంతో ఇష్టమైన రచనలు కూడా కొనసాగించాను. ఆమె రాసిన కొన్ని కవితలకు బహుమతులు కూడా వచ్చాయి. గత ఏడాది ఆమె ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీగా డిప్టేషన్‌లో వచ్చారు. స్టేట్‌ పర్సెంట్‌గా కూడా ఎన్నికయ్యారు.
అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -