Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకనుమరుగవుతున్న ధాన్యం గుమ్ములు

కనుమరుగవుతున్న ధాన్యం గుమ్ములు

- Advertisement -

గోదాంలకే పరిమితమవుతున్న నిల్వలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం

గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రధాన ధాన్యం నిల్వ కేంద్రాలుగా వెలుగొందిన ‘గుమ్ములు’ (ధాన్యం భాండాగారాలు) నేడు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్‌ సౌకర్యాలు పెరగడం, ప్రభుత్వ గోదాంల విస్తరణ కారణంగా సంప్రదాయ గుమ్ములు ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. పూర్వకాలంలో రైతులు పండించిన పంటలను ఎక్కువ కాలం భద్రపరుచుకోవడానికి ‘గుమ్ములు’ వాడేవారు. వీటిని వెదురు, పులిచేరు, కొడిసె కర్రలతో తయారు చేసి మట్టి, పేడతో అద్దెవారు. వీటితోపాటు పశువుల పేడ తీసేందుకు తట్టలు, కోళ్లను కమ్మేసేందుకు గంపలను సైతం తయారు చేసేవారు. వీటిని ఎరుకల, మేదర సామాజిక తరగతికి చెందినవారు తయారు చేసేవారు.
చిన్న సన్నకారు రైతులు, మోతుబరి రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం పుట్టెడు, రెండు పుట్లు, మూడు పుట్లు పట్టే విధంగా గుమ్ములు తయారు చేయించుకునేవారు. ఇవి కేవలం ధాన్యాన్ని నిల్వ చేయడమే కాక, రైతు కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసాగా ఉండేవి. గుమ్ముల్లో ఎక్కువగా ధాన్యాన్ని నిల్వ ఉంచే రైతులను ధనిక రైతుగా చూసేవారు.

గోదాముల్లో ధాన్యం
ప్రస్తుత కాలంలో పంట పండిన వెంటనే రైతులు ఎక్కువ శాతం ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదాంలు, కోల్డ్‌ స్టోరేజీలకు తరలిస్తున్నారు. దీంతో గ్రామాలలో ధాన్యం నిల్వలు ఉండాల్సిన గుమ్ములు ఖాళీగా ఉండి, శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

నిల్వలో మార్పులు
ధాన్యం నిల్వ ప్రక్రియ ఇప్పుడు కేవలం గోదాంలకే పరిమితమైంది. ఇక్కడ ఆధునిక పద్ధతులు, కీటకాల నివారణ చర్యలు, పక్కా భద్రతా ఏర్పాట్లు ఉండటం వల్ల రైతులు, వ్యాపారులు ఈ విధానాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మొత్తం మీద, ఒకప్పటి గ్రామ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సంప్రదాయ ధాన్యం భాండాగారాలు (గుమ్ములు) చరిత్ర పుటలకే పరిమితం కాగా, గోడౌన్ల ద్వారా ధాన్యం నిల్వ పద్ధతి పూర్తి ఆధునికత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -