Tuesday, January 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనోబెల్‌ ఇవ్వనందుకు నిరాశతోనే... గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు సిద్ధమయ్యా

నోబెల్‌ ఇవ్వనందుకు నిరాశతోనే… గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు సిద్ధమయ్యా

- Advertisement -

నార్వే ప్రధానికి ట్రంప్‌ లేఖ
వాషింగ్టన్‌ :
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎందుకు అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు ఆయన తాజాగా ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. తనకు నోబెల్‌ శాంతి బహుమతి రాకపోవడంతో నిరాశ చెందానని, అందుకే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నానని ట్రంప్‌ తెలిపారు. నార్వే ప్రధాని జోనస్‌ గర్‌ స్టోర్‌కు రాసిన లేఖలో ట్రంప్‌ ఈ విషయాన్ని తెలియజేశారని పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌ (పీబీఎస్‌) వెల్లడించింది. అవార్డును నిరాకరించడం అంతర్జాతీయ వ్యవహారాల పట్ల తన వైఖరిలో మార్పు తెచ్చిందని ట్రంప్‌ ఆ లేఖలో వివరించారు. ‘ఎనిమిదికి పైగా యుద్ధాలు ఆపినప్పటికీ నాకు మీ దేశం నోబెల్‌ శాంతి బహుమతిని ఇవ్వలేదు. దీంతో కేవలం శాంతిని గురించి మాత్రమే ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అదే ప్రధానమైన అంశమైనప్పటికీ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఏది మంచో, ఏది సరైనదో ఇప్పుడు నేను ఆలోచించగలను’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించే విషయంలో కఠినంగా వ్యవహరించడాన్ని ట్రంప్‌ సమర్ధించుకున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగంపై డెన్మార్క్‌ చేస్తున్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. డెన్మార్క్‌ సార్వభౌ మత్వాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తూ రష్యా, చైనాల నుండి ఆ దేశం గ్రీన్‌లాండ్‌ను కాపాడలేదని చెప్పారు. ‘డెన్మార్క్‌ ఆ దీవిని రష్యా, చైనాల నుంచి కాపాడలేకపోతోంది. అలాంటప్పుడు దానిపై డెన్మార్క్‌కు యాజమాన్య హక్కు ఎందుకు? ఇందుకు సంబంధించిన రాతపూర్వక ఆధారాలేవీ లేవు. మూడు వందల సంవత్సరాల క్రితం అక్కడ ఓ ఓడ దిగిందని మాత్రమే తెలుసు. కానీ మన పడవలు కూడా అక్కడ దిగుతున్నాయి కదా’ అని అన్నారు. కాగా ట్రంప్‌ తన లేఖలో చెప్పినట్లు నోబెల్‌ బహుమతులను నార్వే ప్రభుత్వం ఇవ్వదు. ఒక స్వతంత్ర కమిటీ వాటిని ప్రకటిస్తుంది. ట్రంప్‌ లేఖ తనకు అందిందని నార్వే ప్రధాని స్టోర్‌ ధృవీకరించారు. సుంకాల పెంపుదలను వ్యతిరేకిస్తూ తాను, ఫిన్లండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ గతంలో పంపిన నోట్‌కు స్పందనగా ట్రంప్‌ నుంచి ఈ సమాచారం అందిందని ఆయన తెలిపారు. కాగా వాషింగ్టన్‌లోని వివిధ యూరోపియన్‌ దేశాల రాయబారులకు కూడా ట్రంప్‌ ఇలాంటి లేఖలే పంపారని పీబీఎస్‌ పాత్రికేయుడు నిక్‌ సిఫ్రిన్‌ తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -