యువతిపై యాసిడ్ దాడి
బాధితురాలి చేతులకు గాయాలు
నిందితుల కోసం పోలీసుల గాలింపు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై ఆగని నేరాలు
న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో దారుణం చోటు చేసుకున్నది. యువతి(21)పై ఓ దుండగుడు యాసిడ్ దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతి ప్రాణాలతో బయటపడగా.. ఆమె చేతులకు గాయాలయ్యాయి. దీంతో ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఈశాన్య ఢిల్లీలోని ఓ కాలేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. యాసిడ్‌దాడి ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిందితుడు, ఆయన మిత్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిది ముకుంద్‌పూర్. ఎక్స్‌ట్రా క్లాసుల కోసం ఆదివారం కాలేజీకి నడుచుకుంటూ వెళ్తోంది. ముకుంద్‌పూర్‌కే చెందిన ప్రధాన నిందితుడు జితేందర్ గత కొంత కాలంగా యువతి వెంటపడుతున్నాడు. వేధిస్తున్నాడు. ఆదివారం.. యువతి కాలేజీకి వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న జితేందర్.. తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆమెను వెంబడించారు.
అశోక్ విహార్‌లోని లక్ష్మీబాయి కాలేజీకి దగ్గరలో దుండగుడు తన మిత్రులతో కలిసి యువతిపై యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం బాధితురాలిని దీప్ చాంద్ బంధు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారమందింది. అనంతరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సుమారు పది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్పారు. ”నిందితులలో ఒకరైన జితేందర్‌ది కూడా ముకుంద్‌పూర్. ఆయన తన ఇద్దరు మిత్రులు ఇషాన్, అర్మాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చాడు. ఇషాన్ బాటిల్‌ను అర్మాన్‌కు అందించాడు. అనంతరం అర్మాన్.. యువతిపై యాసిడ్ విసిరాడు. దాడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు యువతి తన మొఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి” అని బాధితురాలు చెప్పినట్టు పోలీసులు వివరించారు. దాడి అనంతరం ముగ్గురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా గత కొంత కాలంగా జితేందర్.. బాధిత యువతి వెంట పడుతూ వేధిస్తున్నాడు. నెల క్రితం యువతితో ఘర్షణకు దిగినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం. ఈ ఘర్షణ తర్వాతే యువతికి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని పోలీసు అధికారులు చెప్పారు. ఇందులో భాగంగానే జితేందర్ ఈ చర్యకు దిగాడని చెప్పారు. ఘటన అనంతరం క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) అధికారులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. బాధితురాలి వాంగ్మూలం, వైద్యపరీక్షల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
నిందితుల కోసం గాలిస్తున్నామనీ, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. మొన్న మధ్యప్రదేశ్.. నేడు ఢిల్లీ. బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, దళితులకు భద్రత కరువైందని మేధావులు చెప్తున్నారు. కేంద్రంలో, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని అంటున్నారు. సాక్షాత్తూ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఓ మహిళనే ఉన్నప్పటికీ.. తాజా ఘటన జరగటం బాధాకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



