– ఫైర్‌స్టేషన్‌లలో సరిపడా లేని సిబ్బంది
– ఉన్న వారితోనే మాక్‌డ్రిల్స్, అవగాహన.. ప్రమాదాల నివారణ
– లక్షల్లో డీజిల్ బిల్లులు పెండింగ్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఎక్కడైన అగ్నిప్రమాదం సంభవించినా.. ఏదైనా బహుళ అంతస్తుల భవనం ఆకస్మాత్తుగా సముదాయం కూలిపోయినా.. ఏదైనా టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకున్నా.. వెంటనే గుర్తుకొచ్చేది అగ్నిమాపక శాఖ. ప్రస్తుతం ఆ విపత్తు శాఖకే ఆపద వచ్చింది. ఫైర్ స్టేషన్‌లలో సరిపడా సిబ్బంది లేక.. డీజిల్ బిల్లులు రాక స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 137 ఫైర్‌స్టేషన్లు, 9 ఔట్‌పోస్టులు ఉన్నాయి. కొత్తగా మరో 15 ఫైర్‌స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఫైర్ స్టేషన్‌లలో సగం సిబ్బందితో మాత్రమే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆపద సమయంలో ‘తెలంగాణ ఫైర్ డిసాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్’ ఎల్లప్పుడు ముందుంటుంది. 101కు ఫోన్ చేస్తే.. వెంటనే స్పందిస్తూ.. నష్టం తీవ్రతను, ప్రమాద స్థాయిని తగ్గిస్తుంటారు. అంతటి ప్రాధాన్యమున్న ఆ శాఖకు నిధులు లేక.. సిబ్బంది లేక ఉన్న వనరులతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 9 ఫైర్ స్టేషన్‌లు, రెండు ఫైర్ ఔట్‌పోస్టులు ఉన్నాయి. అయితే ప్రతి ఫైర్ స్టేషన్‌లో ఒక ఫైర్ ఆఫీసర్(ఎస్‌ఎఫ్‌వో), ఫైర్ ఇంజిన్ డ్రైవర్/ఆపరేటర్‌లు ఇద్దరు, లీడింగ్ ఫైర్ మెన్ ఒకరు, ఫైర్‌మెన్‌లు 9, కార్యాలయ సహాయకులు(క్లీనర్‌లు) ఒకరు కలిపి సుమారు 14 మంది విధుల్లో ఉండాల్సి ఉంది. వీరు షిఫ్టుల వారీగా 24 గంటల పాటు ఫైర్‌స్టేషన్‌లో అందుబాటులో ఉండాలి. ఒక్క షిప్టుకు కనీసం 5-6 గురు సిబ్బంది ఉండాల్సి ఉంది. కానీ సిబ్బంది కొరతతో ప్రస్తుతం ఒక్కో స్టేషన్‌లో 6-7 మంది సిబ్బందే ఉండటం గమనార్హం. వీరే మూడుషిప్టుల్లో పనిచేసే పరిస్థితి నెలకొంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో పలువురు ఎంపికై ఇతర శాఖలకు వెళ్లిపోయారు. దాంతో పాటు రిటైర్‌మెంట్ అయిన వారి స్థానంలో కొత్తవారిని తీసుకోకపోవడంతో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఆరు ఫైర్‌స్టేషన్‌లకు గాను ఇద్దరే ఫైర్ ఆఫీసర్‌లు ఉండటం గమనార్హం. ఏడీఎఫ్‌లో జాడే లేదు.
ఉన్న సిబ్బందితోనే విధులు
ప్రమాదాలు చెప్పిరావు.. కానీ ఏ ప్రమాదం ముంచుకొచ్చినా.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక వైపు మాక్ డ్రిల్స్ నిర్వహించడం, మరో వైపు స్కూళ్లల్లో, కాలేజీల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తుంటారు. అలా డ్రిల్స్ నిర్వహిస్తున్న సమయంలో.. ఎక్కడైనా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటే వెంటనే స్పందించేందుకు అదనపు సిబ్బంది లేదు. డ్రిల్స్ నిర్వహిస్తున్న ప్రాంతం నుంచి ఘటనా స్థలానికి చేరుకునేందుకు ఆలస్యమైతే.. ప్రజలు ముందుగా నిందించేది అధికారులనే. అలాంటి సమయంలో ఇతర స్టేషన్‌ల నుంచి ఫైర్ ఇంజిన్‌ను పంపే వరకు ఆలస్యం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ప్రమాదాలు చోటుచేసుకుంటే జిల్లాల నుంచి సిబ్బందిని అక్కడికి పంపాల్సిందే. శ్రీశైలం టన్నెల్ ప్రమాదం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌కు ఇరు జిల్లాల నుంచి సిబ్బందిని తరలించడం గమనార్హం.
డీజిల్ బిల్లులు పెండింగ్
కాగా ఫైర్ స్టేషన్ నిర్వహణకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వకపోగా.. కనీసం స్కావెంజర్‌లు సైతం లేరు. దాంతో అధికారులు, సిబ్బంది తమ వేతనాల నుంచి కొంత మొత్తం వెచ్చించి ప్రయివేటు స్కావెంజర్‌లను నియమించుకొని వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా ఫైర్ ఇంజన్ డీజిల్ బిల్లులు లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయి. నిజామాబాద్ ఫైర్ స్టేషన్‌ది సుమారు ఐదు లక్షల వరకు పెండింగ్ ఉండగా.. మిగతా స్టేషన్‌లది సుమారు రూ.50 వేల నుంచి 60 వేల వరకు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. ఆ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రతిసారీ పెట్రోల్ బంకుల నిర్వహకులను బతిమిలాడాల్సిన దుస్థితి నెలకొంది. ఇన్ని సమస్యల మధ్యే.. ఆ శాఖ అధికారులు, సిబ్బంది శక్తికి మించి విధులు నిర్వర్తిస్తూ ప్రమాదాలను అరికట్టడంలో కృషి చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ.. సరిపడా సిబ్బందిని కేటాయిస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
సిబ్బందికొరతపై నివేదించాం
ఇటీవల గ్రూప్ పరీక్షల్లో పలువురు సిబ్బంది ఎంపికై ఇతర శాఖలకు వెళ్లిపోవడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు ఫైర్‌స్టేషన్‌లలో ఖాళీలపై ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల సూచన మేరకు ఉన్న సిబ్బందితో లోటుపాట్లు రానీయకుండా విధులు నిర్వర్తిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 349 ఫిర్యాదులు రాగా వెంటనే స్పందించాం. కాగా అప్పటికే రూ.3.80 కోట్ల ఆస్తినష్టం వాటిల్లగా.. సుమారు రూ.21 కోట్ల ఆస్తినష్టం వాటిల్లకుండా అడ్డుకున్నాం. 22 మంది ప్రాణాలు కాపాడగలిగాం.
- పరమేశ్వర్, డీఎఫ్‌వో నిజామాబాద్