ఐదు గ్రామాలను ముంచెత్తిన రాయల చెరువు
వరద నీటిలో కొట్టుకుపోయిన పశువులు
ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు నిలుపుకున్న ప్రజలు
మూగజీవాలు కోల్పోయి, పంటలు నష్టపోయి అన్నదాతల ఆక్రందన
శ్రీకాళహస్తి : రాయల చెరువుకు గండి పడటంతో గురువారం తెల్లవారు జామున ఐదు గ్రామాలు ఊహించని విపత్తు బారిన పడ్డాయి. ఏం జరిగిందో అర్ధం చేసుకునే లోపే చెరువు నీరు ఆ గ్రామాలపై విరుచుకుపడింది. దాదాపుగా ఒక టిఎంసి నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితి ఆగ్రామాల ప్రజలది! తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఓల్లూరు సమీపంలోని రాయల చెరువు రిజర్వాయర్ కట్టకు గురువారం తెల్లవారుజామున అనూహ్యంగా గండిపడటంతో నెలకొన్న భయానక స్థితి ఇది! చెరువునీరు శరవేగంగా పాతపాలెం, పాతపాలెం దళితవాడ, పాతపాలెం అరుంధతివాడ, కళత్తూరు, కళత్తూరు హరిజనవాడలపై విరుచుకుపడింది. క్షణాల్లోనే నీటిమట్టం పెరిగిపోవడంతో నిద్రమంచం మీద నుండి లేచిన వారు లేచినట్టు కట్టుబట్టలతో పరుగులు తీశారు. గ్రామాల్లోనే ఉన్న ఎత్తైన ఇంటి డాబాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
అయితే, ఈ సంఘటనలో పశు సంపద పెద్ద ఎత్తున మృతి చెందింది. ఆవులు, గేదెలు,మేకలు, గొర్రెల మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం కూడా సంభవించింది. మోటారు బైకులు, ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లు సైతం వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం ప్రవాహ తీవ్రతను తెలియజేస్తోంది. తొమ్మిది అడుగుల ఎత్తులో చెరువు నీరు గ్రామాలపైకి దూసుకువచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రాయల చెరువు రిజర్వాయర్‌కు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. రిజర్వాయర్ సామర్థ్యం సుమారు ఒక టిఎంసి కాగా, ఆ స్థాయికి నీటి నిల్వలు చేరాయి. ఆ నీరు మొత్తం ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. గతంలో టిడిపి హయాంలో నీరు-చెట్టు పథకం కింద రాయల చెరువులో పనులు జరిగాయి. ఈ పనుల్లో అప్పట్లో అవినీతి జరిగిందని, అందువల్లే ఇప్పుడు ఈ చెరువుకు గండిపడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారీగా ఆస్తి నష్టం
ఊహించని వరదతో ఈ గ్రామాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ గ్రామాల్లోని వారు పాడి పశువులను ఎక్కువగా పెంచుతున్నారు.పెద్ద సంఖ్యలో పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల మందలు రైతుల కళ్లెదుటే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. పశువులు ఆయా గ్రామాల్లోని మృతి చెంది బురద నీటిలో పడి ఉన్నాయి. వాటిని చూసి పెంపంకందార్లు జీవనాధారాన్ని కోల్పోయామంటూ కన్నీరు మున్నీరయ్యారు. పంట పొలాలను వరద నీరు ముంచెత్తడం, పొలాల్లో బురద పేరుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో ఇసుక, బురద మేటలు ఏర్పడ్డాయి. ఈ ఐదు గ్రామాల్లోని బీడీ కార్మికుల, మత్స్యకారుల ఇళ్లలోంచి బీడీ తయారీ సామగ్రి, వలలు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లల్లోకి భారీ ఎత్తున వరద నీరు, బురద చేరింది. ఆస్తి నష్టం కోట్ల రూపాయల్లోనే ఉంటుందని బాధితులు వాపోయారు.
కాళంగి రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత
రాయలచెరువుకు గండితో ఖాళీ అయిన రిజర్వా యర్ నీరు ఐదు గ్రామాలను ముంచెత్తి అనంతరం గాజుల కండ్రిగ ఏటిగుండా కాళంగి రిజర్వాయర్‌కు చేరింది. కాళంగి రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి వదిలారు. మునక గ్రామాల నుంచి వరదలో కొట్టుకొచ్చిన పశువులు, మేకల కళేబరాలు కాళంగి జలా శయంలో కనిపించాయని అక్కడి గ్రామస్తులు తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరం
రాయలచెరువుకు గండి పడిన విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. తిరుపతి ఎస్‌పి సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి ఆర్‌డిఒ భాను ప్రకాష్ రెడ్డి, ఎన్‌టిఆర్‌ఎఫ్ బందాలతో కలిసి మునక గ్రామాల్లో పర్యటించారు. బురద, వరద నీటిని తొలగించేందుకు ప్రయత్నించారు. బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు. గురువారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా కెవిబి పురం చేరుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతి చెందిన పశువులను వాహనాల్లో తరలించారు. ఆస్తి, ప్రాణ నష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మునక గ్రామాలను పరిశీలించారు.
కుటుంబానికి రూ.లక్ష చొప్పున తక్షణ సాయం అందించాలి : వ్యకాస
రాయల చెరువు ఘటనలో మునకకు గురైన గ్రామాలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ పరిశీలించారు. ఊహించని వరద మిగిల్చిన నష్టాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల్లో పాడి రైతులు, రైతులు, బీడీ కార్మికులు, మత్స్యకారులు అధికంగా ఉన్నారని, వీరంతా భారీ స్థాయిలో ఆస్తులు కోల్పోయారని తెలిపారు. ఆవుకు రూ.50 వేలు, బర్రెకు రూ.60 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. నీరు-చెట్టులో జరిగిన అవినీతి కారణంగానే నేడు రాయలచెరువుకు గండి పడిందని విమర్శించారు.



