– సీపీఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి
– సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ లో సిపిఐ పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ నియోజకవర్గ కమిటీని వేసిన నాయకులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. శనివారం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల కార్యవర్గ,కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పవన్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో నూతనంగా సిపిఐ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు జిల్లా పార్టీకి సమాచారం లేకుండా వేశారని, నియోజకవర్గ కమిటీని జిల్లా పార్టీ గుర్తించదని పార్టీ శ్రేణులు తెలుసుకోవాలని అన్నారు..పార్టీ నిబంధనలకు పాటించని నాయకుల పైన పార్టీగా కచ్చితంగా క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పేద అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సమసమాజ స్థాపనే ధ్యేయంగా నిరంతరం సిపిఐ పార్టీ పోరాడుతుందని అన్నారు. భారత దేశంలో సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిందని అన్నారు. వందేళ్ల సుదీర్ఘ ఉద్యమ స్ఫూర్తితో పీడిత వర్గాల ప్రజలకు, అణగారిన వర్గాల హక్కుల కోసం సిపిఐ పోరాటం చేసిందన్నారు. గూడు నీడ లేని ప్రజలకు ఉన్నత వర్గాలతో సమానంగా జీవించే హక్కుల కోసం పోరాడటంలో సిపిఐ పాత్ర ఉందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిరంకుశ పాలన సాగిస్తోందని, విమర్శించారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధం అని చెపుతున్న కూడా బూటకపు ఎన్కౌంటర్ లు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆ ఎన్కౌంటర్ లను ఆపి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చేరువవుతుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు తమ పార్టీ మద్దతిచ్చిందని పేర్కొన్నారు . ఖచ్చితంగా 30000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవనున్నారని అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో మూడు మండలాల వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచుతామని తెలిపారు..భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన లక్షలాది మందితో ఖమ్మంలో శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ శతజయంతి ఉత్సవాలకు ప్రపంచంలోని 40 దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు ప్రతినిధులు, కమ్యూనిస్టు కార్యకర్తలు పార్టీ శ్రేణులు సానుభూతిపరులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని , శత జయంతి ఉత్సవాలకు సిద్దిపేట జిల్లా నుండి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ అక్కన్నపేట, కోహెడ మండలాల కార్యదర్శులు కొమ్ముల భాస్కర్, వేల్పుల శ్రీనివాస్,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేశ్,జేరిపోతుల జనార్దన్,పిల్లి రజిని,జిల్లా కౌన్సిల్ సభ్యులు బొజ్జపురి రాజు తదితరులు పాల్గొన్నారు.



