Sunday, January 18, 2026
E-PAPER
Homeసోపతివిద్యార్థి దశలోనే కెరీర్‌ ట్రాక్‌ కనుగొనండి..!

విద్యార్థి దశలోనే కెరీర్‌ ట్రాక్‌ కనుగొనండి..!

- Advertisement -

మీరు ఎంచుకున్న కెరీర్‌ మీకు ఎక్సైట్‌ మెంట్‌ గా వుండాలి. నిత్యం మిమ్మల్ని ఉర్రూతలూగించే అమితోత్సాహాన్ని మీలో నింపేదై వుండాలి. అట్లాంటి కెరీర్లోనే మీరు మీ ప్రతిభా సామర్థ్యాలను, మీ ఆసక్తిని సరిసమానంగా ఉపయోగించి అత్యుత్తమ శ్రేణిలో రాణించగల్గుతారు. అయితే ఈ కెరీర్‌ ట్రాక్‌ విద్యార్థి దశలోనే కనుగొని దిశా నిర్దేశం చేసుకోవాలి.

అమెరికా ప్రెసిడెంట్‌ ‘బిల్‌ క్లింటన్‌ని ఏడేళ్ళ ప్రాయంలో ‘నువ్వేమవుతావు’ అని ఎవరో అడిగారు. అపుడు నేను ఈ దేశం (అమెరికా) ప్రెసిడెంటునవుతా..! అన్నాడట. అలాగే తక్కువ వయసులోనే ఆస్కార్‌ అవార్డు పొందిన ఆంగ్ల చిత్రాల దర్శకుడు స్పీల్బర్గ్‌ ఒక ఇంటర్వ్యూలో తన దైనందిన చర్యలను వివరిస్తూ… ఉదయం నిద్రలేవగానే టిఫిన్‌ కూడా తినబుద్ధికాదని దృష్టంతా షూటింగ్‌ మీద కేంద్రీకృతమై స్టూడియోకి వెళ్ళిపోతానని చెప్పాడు. తమ తమ రంగాలలో తమదైన అపూర్వమైన ముద్రలను వేయగల్గిన ఈ ప్రముఖ విజేతల మాటల వెనుక కెరీర్‌ ట్రాక్‌ను కనుక్కోవటానికి ఉపయోగపడే బలమైన సూత్రం దాగివుంది. అది అందరికీ అవసరం కూడా.

బాల్యంలో జరిగేదేమిటి..?
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అని మనవాళ్ళు అంటూంటారు. ఒకొక్క పువ్వుది ఒక్కొక్క విశిష్టమైన సౌరభం. సరయిన కెరీర్‌ను ఎంచుకోవడం ఎలాగో శిక్షణ ఇచ్చే -కౌన్సెలర్లు జోడీ గోథర్ట్స్‌, కార్టెల్‌ ఫిలిప్లు, బాల్యంలోనే మన కెరీరు జాడలు బయటపడతాయంటారు. చిన్నప్పుడు మనం భిన్న పాత్రలను పోషిస్తుంటాం. మనకు బాగా నచ్చిన ఆటలను ఆడుతుంటాం. చిలిపి వూహలతో పరవశించి పోతుంటాం. ఆ బాల్యపు మధురమైన ఆసక్తులలోనే పరిపక్వత అంతగా కన్పించని ఆ మనోభావాలలోనే మన ఉజ్వల భవిష్యత్తు ఏ ట్రాక్‌లో దాగివుందో సూచన ప్రాయంగా కన్పిస్తుంది. పెద్దయ్యాక ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయినా, ఉత్తమ కళాకారుడయినా, లేదా ఒక సామాన్య గుమస్తాగా మిగిలిపోయినా, ఒక దేశానికి అధినేత అయినా, అది చిన్నప్పటి చిలిపి తర్కరహితమైన ఊహల అంత్య లబ్దమే (Ultimate Products). చిన్నప్పట్నుంచి మనకు ఏది ఇష్టమో అందులోనే మనం రాణిస్తాం. లేదా అందుకు కాస్తయినా దగ్గరగా వుండే ఉద్యోగాలలోనైనా (లేదా వృత్తి వ్యాపారాదులు) మనం ఆశించినంత మేరకు కాకపోయినా, తగిన మేరకు విజయం పొందుతాం.

తరువాత..?
బాల్య దశనుండి ఎదిగే క్రమంలో మన కెరీర్‌ జాడలు పలు అవరోధాల కారణంగా మసక భారతాయి. ఇతర వ్యక్తుల (ఎక్కువ సందర్భాల్లో తల్లిదండ్రుల) ఆకాంక్షలు మనపై రుద్దబడతాయి. సామర్ధ్యాన్ని పెంపొందించుకునే నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల ఏర్పడే న్యూనతా భావాలు, సెల్ఫ్‌-ఎస్టీమ్‌ లేకపోవడం, ఆత్మ విశ్వాసం కొరవడటం వంటివి ఎన్నో మన కెరీర్‌ ట్రాక్‌ను కప్పేస్తాయి. అయితే ఎన్ని కలుపు మొక్కలు చుట్టూ చేరి లతలు అల్లినప్పటికీ మన గుండెల్లో మన ‘తపన’ అలా సజీవంగా చైతన్యవంతంగా వుంటూనే వుంటుంది.

మరైతే ఇపుడేం చేయాలి..?
కెరీరు ఎంచుకునే ముందు బుద్ధి కుశలతతో నిర్ణయం తీసుకోవడం కాదు కావల్సింది. మనకు ఏది ‘సరియైనది’ అన్పిస్తుందో అది ఎంచుకోవడం, ‘నేను ఏం చేస్తున్నాను..?’, ‘నేను చేస్తున్న పని నాకు అమితోత్సాహాన్ని ఆనందాన్ని ఇవ్వగల్గుతోందా…?’ అని ప్రశ్నించుకోవాలి. అఫ్‌కోర్స్‌ మీరు మీకు అంతగా ఇష్టంలేని ఏదేని ఒక పనిని సమర్ధవంతంగా చేయగల నైపుణ్యం కలవారయి వుండవచ్చు. డబ్బు విపరీతంగా సంపాదిస్తువుండవచ్చు. మీకు బాగా నచ్చిన రంగంలో మీకసలు అవకాశమే రాకపోయుండవచ్చు.

రెండిటినీ మేళవించడమే మన కెరీర్‌ ట్రాక్‌ను ఎంచుకోవడంలో చేయవల్సింది. మీ ప్రతిభను, మీ ఆసక్తిని జోడించగల్గాలి. అలాంటి అవకాశాలు వెతుకోవాలి. ‘You have to have a dream so you can getup in the morning’ అంటాడు కార్డెల్‌ ఫిలిప్స్‌. ఉదయం లేవటానికి, లేచి పనిచేయడానికి మీకు ఒక కల వుండాలి అని ఈ కొటేషన్‌ అర్థం. ఆ ‘కల’నే మన తపన అని అనుకోవచ్చు. ఆ తపన మిమ్మల్ని తిండి కూడా తిననివ్వకుండా చేయాలి. మిమ్మల్ని తనవైపు బలంగా ఆకర్షించాలి. అట్లాంటి రంగంలో మీరు మీ సర్వశక్తులను, ప్రతిభా సామర్ధ్యాలను నూటికి నూరుశాతం ఉపయోగిస్తారు. ఇక ఆ రంగంలో మీరు నెం.1
అవుతారని వేరేగా చెప్పాలా..?

ఎక్కడ దొరుకుతుంది అట్లాంటి ఉద్యోగం?
మీకు నచ్చినదీ, మీరు ప్రతిభ కన్పరచగలిగేదీ ఒక నిర్ణీత ఆకారాన్ని ఏర్పరుచుకుని సింగారించుకుని మీ ఎదురుగా కన్పించదు. మీరు దానికోసం వెదకాలి. విద్యార్థి దశలో వుండగానే మీ అన్వేషణ ప్రారంభించాలి. మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా తరిమివేసే మీ ఆసక్తి ఎక్కడుందో మీరు మీ చుట్టూ వున్న పరిసరాలను నిశితంగా పరిశీలనాత్మకంగా చూసి కనుక్కోవాలి. మీరీ అన్వేషణను ఎంత త్వరగా మొదలుపెడితే అంత త్వరగా సత్ఫలితాలను పొందుతారు.

ఆలస్యమయ్యేకొద్దీ మీకు మీ జీవితంలో లభించినదాన్నే ఎంచుకుని రాజీ పడవల్సి వస్తుంది. ప్రతిభ వున్నా లేక పోయినా, ఆసక్తి లేకపోవడం కారణంచేత సామాన్య మానవుడిలా అసమర్థుని జీవనయాత్ర చేయవల్సి వుంటుంది. జార్జి బెర్నార్డ్‌ షా ఏమంటాడో గుర్తుకు తెచ్చుకోండి. మీకు కావల్సినదాన్ని పొందటానికి మీరు అప్రమత్తంగా వుండండి. లేదా మీరు పొందినదేదో అదే మీకు కావల్సినదని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుని రాజీ పడుతూ బతుకు వెళ్ళదీయాల్సి వుంటుంది. అందుచేత తెలివి తేటలతోను, అంతర్వాణి ప్రబోధాలతోను కలిపి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -