Saturday, May 17, 2025
Homeఎడిట్ పేజిఆర్మీలోనూ 'ఆమె'పై వివక్షేనా?

ఆర్మీలోనూ ‘ఆమె’పై వివక్షేనా?

- Advertisement -

”భారత వైమానిక దళంలో మహిళలు రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడపగలిగినప్పుడు, వారిని ఆర్మీలో జడ్జి అడ్వకేట్‌ జనరల్‌(లీగల్‌) పోస్టుల్లోకి ఎందుకు తీసుకోవడం లేదు. మహిళలకు తక్కువ పోస్టులు ఎందుకు కేటాయించారు? ఎక్కువమంది మహిళలను తీసుకుంటే వచ్చిన నష్టమేంటి?” ఇవన్నీ సుప్రీంకోర్టు మొన్న బుధవారం కేంద్రానికి వేసిన ప్రశ్నలు. జెఎజి పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందని అషూర్‌కౌర్‌, అస్థత్యాగి అనే ఇద్దరు మహిళా అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం పైవిధంగా స్పందించింది. అంతేకాదు, ఈ పోస్టుల్లో మహిళలు తక్కువగా ఉండటం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేసింది.ఆ పోస్టులకు ఫిప్టీ-ఫిప్టీ శాతం ప్రతిపాదికన ఎంపిక చేయడంలోని సహేతుకతను ప్రశ్నించింది. వీటిలో లింగ నిష్పత్తి వర్తించదనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు అనుసరించడం లేదని నిలదీసింది. ఇది మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకునే కేంద్రానికి గొంతులో వెలక్కాయ పడ్డట్లైంది.
నేడు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణించడం చూస్తున్నాం. అనేక అవమానాల్ని, భరిస్తూ, అవహేళనల్ని అధిగమిస్తూ కుటుంబం కోసం కష్టపడటం, నిలబడటం ఈ పురుషాధిక్య సమాజంలో చిన్న విషయమేమి కాదు. వారికి చేయూత నందించి భరోసాగా నిలబడాల్సిన పాలక, అధికారగణం ఆ పనిచేయకపోగా, తొక్కిపెట్టేలా వ్యవహరిస్తున్న తీరు ఆందోళనాకరం. ఆర్మీలోని జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ లీగల్‌ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలో మహిళ ఉద్యోగులిద్దరూ వరుసగా నాలుగు, ఐదు ర్యాంకులు సాధించారు. వీరిని అభినందించి ఒక మెట్టు ఎక్కించాల్సిన కేంద్ర సర్కార్‌ ఆ పనిచేయలేదు. పురుష అభ్యర్థులకన్నా మెరిట్‌లో పైచేయి సాధించినా మహిళా కోటాలో పోస్టులు లేవని చెప్పి వారిని తిరస్కరణకు గురిచేసింది. మొత్తం ఆరు పోస్టుల్లో మహిళలకు మూడు ఖాళీలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఇది మహిళల పట్ల కేంద్రం వివక్షను తేటతెల్లం చేస్తున్నది. ఒక రకంగా జెండర్‌ సమస్యను ముందుకు తెచ్చి వారిని అవమానపరుస్తున్నది. పైగా పురుషు లకు, స్త్రీలకు సమానమైన కోటా ఉన్న పోస్టుల్లో ఖాళీలు లేవని చెప్పడం మరీ వివక్షాపూరితం. అందుకే ”పురుషులు, స్త్రీల ఆధారంగా ఖాళీలను విభజించడం వలన అధిక అర్హత కలిగిన అభ్యర్థులను తీసుకోనప్పుడు లింగ తటస్థ పోస్టులని ఎందుకు పిలుస్తారని’ కోర్టు కేంద్రాన్ని గట్టిగానే నిలదీసింది, తీర్పును రిజర్వు చేసింది.
మాట మాట్లాడితే మహిళలను గౌరవిస్తున్నామని, అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్నామని, అభివృద్ధికి సహాయ సహకారాలందిస్తున్నామని మోడీతో పాటు ఆయన పరివారమంతా పలు వేదికల్లో ప్రగల్భాలు పలుకుతున్నది. ఇండియాకు ఎన్నో పతకాలు సాధించిన మహిళా రెజ్లర్ల పరిస్థితిని చూశాం కదా! పారిస్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో జరిగిందేమిటి? విజేతకు అడుగు దూరంలో ఉన్న రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ వెయిట్‌ ఎక్కువగా ఉందని సెలక్షన్‌ కమిటీ రిజక్ట్‌ చేసింది. దీని వెనుక మోడీ హస్తముందని అప్పట్లోనే అనేక విమర్శలొచ్చాయి. మహిళలకు సమానత్వ హక్కుపై రాజ్యాంగం అనేక అంశాల్ని పొందుపర్చింది. వాటిని అమలు చేయకపోగా వాటిని విస్మరించే కుట్రలు చేయడం నిజంగా ఆక్షేపణీయం. ఇదొక్కటే కాదు ప్రతి ఎంపికలోనూ స్త్రీల సమానత్వం కొరవడుతున్నది. ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డ్రెవ్‌లో మహిళల ఉద్యోగ నియామక ప్రక్రియ, ఎన్సీపీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌లో పురుషులకు డెబ్బయి ఆరు పోస్టులు కేటాయిస్తే మహిళలకు కేటాయించింది కేవలం ఆరు మాత్రమే. మహిళల్ని అభివృద్ధి చేయడం, వారిని అగ్రస్థానంలో నిలబెట్టడమంటే ఇదేనా?
ఇంజినీరింగ్‌ చదివిన అవివాహితుల నియామకాలకు సంబంధించి రక్షణ రంగం ఇటీవల ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో మూడువందల డెబ్బయి తొమ్మిది టెక్‌ పోస్టులకు గాను మహిళలకు కేటాయించింది. ఇరవై ఆరు మాత్రమే. ఇలా ఎందులో చూసిన మహిళల కోటా నామమాత్రంగా ఉంటున్నది. మొత్తం భారత సైన్యంలో క్రియాశీల ఉద్యోగులు పన్నెండు లక్షల పైచిలుకు మంది ఉంటే అందులో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగుల సంఖ్య ఏడు వేలు మాత్రమే. మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు దక్కడం లేదని ఈ గణాంకాలను చూస్తేనే అర్థమవుతున్నది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన బేలా త్రివేదికి కనీసం ఫేర్‌వెల్‌ పార్టీ కూడా ఏర్పాటు చేయకుండా ఇంటికి సాగనంపింది సర్కార్‌. మహిళల పట్ల కాషాయ నేతల దృష్టిలోపానికి ఇదొక మచ్చుతునక. మహిళల గౌరవాన్ని కిందకు దిగజార్చడం పతనావస్థకు పరాకాష్ట.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -