దేశం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందని మన పాలకులు ఎన్ని కబుర్లు చెబుతున్నా అమ్మాయిల పుట్టుక మాత్రం ప్రశ్నార్థకంగానే మారుతోంది. బాలికలు చాలా కాలంగా పుట్టుకతోనే లింగ నిష్పత్తితో పోరాడుతున్నారు. లింగ నిష్పత్తిని రూపుమాపేందుకు దశాబ్దాలుగా ఎన్ని చట్టాలు రూపొందించినా, విభిన్న కార్యక్రమాలు చేపట్టినా కొడుకులకు ఇస్తున్న ప్రాధాన్యం కూతుళ్ళకు ఇవ్వడం లేదు. ఇది అమ్మాయిల మనుగడను దెబ్బతీస్తూనే ఉంది. అయితే ఇటీవలి కొన్ని లెక్కలు చూస్తే లింగ నిష్పత్తిలో హర్యానా వంటి రాష్ట్రాలు కొంత మెరుగుదల ఉన్నా కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు ఆందోళనకరంగా ఉన్నాయి.
2020లో పూణే మునిసిపల్ డేటా 1,000 మంది అబ్బాయిలకు 946 మంది బాలికలను నమోదు చేసింది. 2024 నాటికి ఈ సంఖ్య 911కి పడిపోయింది. విద్యా సంస్థలు, పట్టణ పురోగతికి ప్రసిద్ధికి మారుపేరుగా చెప్పుకునే నగరంలోనే లింగ పక్షపాతం ఇలా స్పష్టమైన హెచ్చరికను జారిచేస్తోంది.PCPNDT చట్టం, 1994ను అమలు చేయడంలో వ్యవస్థాగత వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఈ లెక్కలు చూస్తే అర్థమైపోతుంది. ఈ చట్టాలు భారతదేశంలో భ్రూణ హత్యలను నిరోధించడానికి, తగ్గుతున్న లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి ఆమోదించబడింది. కానీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు ‘ఫారమ్ ఎఫ్’ సమర్పణలను (డయాగస్టిక్స్ దుర్వినియోగాన్ని నివారించడానికి అల్ట్రాసౌండ్‌లకు అవసరం) ధృవీకరించినప్పటికీ, నమోదు చేయని సోనోగ్రఫీ కేంద్రాలపై దాడులు చేసినప్పటికీ చాలా మంది గర్భిణీలు కుటుంబాలకు భయపడి అధికారులకు సహకరించడం లేదు.
అమలులో అంతరాలు…
ూజూచీణు చట్టం (2003లో సవరించబడింది) ప్రినేటల్ టెస్టింగ్ కోసం డయాగస్టిక్ టెక్నిక్‌ల వాడకాన్ని నియంత్రించడానికి, లింగ నిర్ధారణను నిషేధించడానికి రూపొందించబడింది. అయినప్పటికీ ఈ చట్టాన్ని ఉపయోగించుకు నేందుకు గర్భిణులు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారని పూణే మున్సిపల్ కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థలు అంటున్నాయి. ఇంకా వైద్యులు, డయాగస్టిక్ కేంద్రాలు సాంకేతిక కారణాల వల్ల కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు కేసులు పెట్టినప్పటికీ అవి నిరూపణకు నిలబడక కొట్టివేయడుతున్నాయి. ఫారమ్‌లు సరిగ్గా నింపకపోవడం, డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడం, సరైన సాక్షాధారాలు లేకపోవడమే దీనికి కారణమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
మన దేశంలోనే ఎక్కువ
ఎటువంటి శిక్షణా లేకుండా రహస్యంగా లింగ నిర్ధారణ చేస్తున్న కేంద్రాలు మన భారత దేశంలో పెద్ద ఎత్తున ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశమంతటా జనన సమయంలో లింగ నిష్పత్తి (ఎస్‌ఆర్‌బీ) చాలా కాలంగా 1,000 మంది అబ్బాయిలకు 950-975 మంది బాలికలు (లేదా 100 మంది స్త్రీ జననాలకు 105 మంది పురుషుల జననాలు) అనే సహజ జీవసంబంధమైన ప్రమాణం కంటే నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. నమూనా నమోదు వ్యవస్థ గత దశాబ్దంలో జనన సమయంలో లింగ నిష్పత్తులు 1,000 మంది అబ్బాయిలకు 900 – 930 మంది బాలికల మధ్య హెచ్చుతగ్గులకు గురయ్యాయని నివేదిస్తుంది.
చట్టాల అమలు
ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిన లింగ నిష్పత్తిని (సుమారు 832) 870కి పైగా మెరుగుపరిచిన హర్యానా, 857 నుండి 911కి పెరిగిన రాజస్థాన్ రాష్ట్రాలు పురోగతి సాధించాయి. మరోవైపు బీహార్, కర్ణాటకలు క్షీణతను చూశాయి. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2020 ప్రకారం 2014-16లో బీహార్‌లో జనన సమయంలో లింగ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు దాదాపు 895 మంది బాలికలు ఉండగా, కర్ణాటకలో 2018-20లో గత సంవత్సరాలతో పోలిస్తే దాదాపు 916 మందికి పడిపోయింది. మహారాష్ట్రలో ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 (చీఖీనూ-5) జనన సమయంలో లింగ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు 913 మంది బాలికలను నివేదించింది. ఇది చీఖీనూ-4 (2015-16)లో 924 నుండి తగ్గింది. ఈ అంతర్ రాష్ట్ర వైరుధ్యాలు చట్టాల అమలుతో పాటు వాటిని ఉపయోగించుకునే విధంగా ప్రజల్లో తీసుకొస్తున్న అవగాహన ఎంత బలహీనంగా ఉందో రుజువు చేస్తున్నాయి.
మెరుగుపరచడం ఎలా..?
జనన సమయంలో తగ్గుతున్న లింగ నిష్పత్తిని తగ్గించడంలో దేశంలో కీలక పాత్ర పోషించాల్సిన నినాదం బేటీ బచావో బేటీ పఢావో. ఇది లింగ వివక్షను నిరోధించడానికి, ఆడపిల్లల మనుగడ/అభివృద్ధిని నిర్ధారించడానికి, విద్యను ప్రోత్సహించడానికి 2015లో ప్రారంభించబడింది. ముఖ్యంగా కమ్యూనిటీ సమీకరణ, జిల్లా స్థాయిలో దీన్ని పటిష్టంగా అమలు చేసే వ్యవస్థ ఉన్న చోట మాత్రమే కొంత వరకు మెరుగుదల ఉందని కొన్ని లెక్కల ఆధారంగా తెలుస్తుంది. హర్యానాతో సహా కొన్ని రాష్ట్రాలు భ్రూణ హత్యలను నిరోధించడం కోసం అనుమానస్పద ప్రాంతాల్లో గర్భధారణ తర్వాత రికార్డులను ట్రాక్ చేస్తాయి. గర్భ విచ్ఛిన్నాన్ని నిరోధించడానికి ఆ ఐడీలకు స్కాన్‌లను లింక్ చేస్తూ, గర్భిణీలకు ప్రత్యేకమైన ఐడీలను జారీ చేయాలని ఇటీవల ప్రతిపాదించింది. దీనికి అదనంగా హర్యానా ‘కుమార్తెల నేమ్‌ప్లేట్’ అనే పద్దతిని తీసుకొచ్చింది. దీని ప్రచారం విస్తృత సామాజిక మార్పు ప్రయత్నంలో భాగంగా నవజాత బాలికల కోసం వారి పేర్లతో కూడిన నేమ్‌ప్లేట్‌లను గర్వంగా ప్రదర్శించమని కుటుంబాలను ప్రోత్సహించింది. ఇది కూడా ఆ రాష్ట్రంలో బాలికల మనుగడకు కొంత ఉపయోగపడుతోంది. కఠినమైన లైసెన్సింగ్, ఆడిట్‌లు, పౌర సమాజంతో ఎన్‌జీఓల సమన్వయం, స్త్రీ విద్య, ఆర్థిక ప్రోత్సాహకాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను లింగ కార్యక్రమాలతో ముడిపెట్టే విధానాలు దీర్ఘకాలిక మార్పును సృష్టించాయి. కమ్యూనిటీ విజిలెన్స్ ద్వారా అమలు చేయబడిన జిల్లాల్లో ఎస్‌ఆర్‌బీ మరింత పటిష్టంగా ఉన్నట్లు కనబడుతోంది.
క్షీణతకు మూల కారణాలు
బేటీ బచావో బేటీ పఢావో నినాదం తర్వాత చెబుతున్న లెక్కలు, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ డేటా, మీడియా పరిశోధనలు, ఎన్‌జీఓల గుణాత్మక అధ్యయనాలు, ూజూచీణు చట్టంపై పార్లమెంటరీ కమిటీ నివేదికలు జనన సమయంలో లింగ నిష్పత్తిలో తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నాయి. విస్తృత ఆర్థిక, సామాజిక మార్పులు ఉన్నప్పటికీ వంశపారంపర్యత, వారసత్వం, వృద్ధాప్యంలో భద్రత, ఆచారాలను అనుసరించి మగ పిల్లలకు విలువనిచ్చే కుటుంబాల వల్ల కొడుకు ప్రాధాన్యత మన దేశంలో కొనసాగుతోంది. తక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కొడుకును ‘భరోసా’గా భావిస్తున్నారు. చిన్న కుటుంబాలు ఈ పక్షపాతాన్ని తీవ్రతరం చేశాయి.
కుటుంబాల్లో మార్పు…
చట్టాలను ఉల్లంఘించేవారికి సరైన శిక్షలు లేకపోవడంతో సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వేసే జరిమానాలు, లైసెన్స్ రద్దులు, చట్టపరమైన చర్యలు క్లినిక్‌లు, వైద్యులను ఏ మాత్రం భయపెట్టలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు సరైన సాక్షాధారాలు చూపెట్టలేకపోవడం. గర్భిణీలు తమ భర్తలు, అత్తమామల ఒత్తిడితో సమస్యను బయటకు చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి కేవలం చట్టాలు వచ్చినంత మాత్రాన అమ్మాయిలను కాపాడుకోలేము. ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసే వ్యవస్థ కింది స్థాయి నుండి ఉండాలి. మరీ ముఖ్యంగా ఆడపిల్లను కాపాడుకోవాలి, ఆమెనూ ఓ మనిషిగా గుర్తించాలి అనే భావన కుటుంబాల్లో పెంచాలి. అప్పుడే ఆడపిల్ల మనుగడ సాధ్యమవుతుంది.