Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఝరాసంగం తహసీల్దార్‌ కార్యాలయంలో వివక్ష

ఝరాసంగం తహసీల్దార్‌ కార్యాలయంలో వివక్ష

- Advertisement -

– కార్యాలయంలోకి రావాలంటే చెప్పులు వదిలిరావాలని హుకుం
– అధికారులకు అనుమతి.. రైతులకు నిరాకరణ..?
– జిల్లా అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
నవతెలంగాణ-ఝరాసంగం

పౌరుల హక్కులపై అవగాహన కల్పించాల్సిన అధికారులే వారి హక్కులకు భంగం కలిగించే విధంగా ఆదేశాలను జారీ చేయడమంటే వివక్షతను వారే పెంచి పోషిస్తున్నట్టు కనిపిస్తోంది. రైతులు, విద్యార్థులు, భూముల క్రయవిక్రయదారులు తమ చెప్పులను కార్యాలయం బయటనే వదిలేసి రావాలని తహసీల్దార్‌ కార్యాలయంలో ముఖ్య అధికారి హుకుం జారీ చేయడం పట్ల పలువురు విమర్శలు కుప్పిస్తున్నారు. ఈ ఆదేశాలు అందరికీ వర్తిస్తాయంటే అదేమీ లేదు. అధికారులకు మాత్రం వర్తించవట.. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝురాసంగం తహసీల్దార్‌ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది.
ఝురాసంగం తహసీల్దార్‌గా ముత్యాల తిరుమలరావు.. బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాలయ ఆవరణలో పచ్చటి చెట్లను నరికి వేయించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా రైతులు, మహిళలు తదితరులు చెప్పులు బయటే వదలాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలపై ఆర్డీవో, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు కనిపించకపోవడంపై స్థానిక రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఎల్గోయి గ్రామంలో భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ఎమ్మార్వో తిరుమల రావు, గిర్ధవర్‌ రామారావు.. వీరిద్దరూ ఇక్కడినుంచి వెళ్ళిపోతే మా దరిద్రమే పోతుందని రైతు గోపాల్‌ రెడ్డి సభాముఖంగానే బహిరంగంగా వారి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాకుండా మండలానికి సందర్శనకు వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురికి పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ఓ షాడో ప్రజాప్రతినిధి సపోర్ట్‌ను అడ్డుపెట్టుకొని ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. రాంచందర్‌
ఝరాసంగం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తన స్వంత ఆస్తిగా భావించి తన ఇంటికి వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తించినట్టుగా చెప్పులు వేసుకొని తన ఛాంబర్‌లోకి రావొద్దని ప్రజలను బెదిరించడం అన్యాయం. మండలంలో ప్రజల మధ్య ఐక్యత నెలకొల్పడానికి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సైతం ఇలాంటి నిబంధనలు లేవు. ఇలాంటి ఆలోచనా విధానం ఉన్న తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -