– రాజకీయ నాయకుల దృష్టి స్థానిక సంస్థలపైనే..
– గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇవే చర్చలు..
– ఆశావహుల్లో ఎడతెగని టికెట్ల ఉత్కంఠ
నవతెలంగాణ తంగళ్ళపల్లి:
రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇక గ్రామాల్లో స్థానిక సంస్థలు ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏ పార్టీ నాయకుల నోట విన్నా నేను సర్పంచిగా పోటీ చేస్తాను, నేను ఎంపీటీసీగా పోటీ చేస్తాను, నేను జెడ్పిటిసి గా పోటీ చేస్తాను మాకు ఈసారి రిజర్వేషన్లు అనుకూలించాయి, మాకు కాస్త సహకరించండి..ఈసారి మాకు ఓటేసి గెలిపించండి అంటూ గ్రామాల్లో ఆశావాహులు తమ జోరును కొనసాగిస్తున్నారు.
రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థల్లో సర్పంచ్,ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాలలో కొందరికి అనుకూలంగా రిజర్వేషన్లు రావడంతో ఉత్సాహంగా గ్రామాల్లో పోటీగా ప్రచారం కొనసాగించుకుంటున్నారు. మండలంలో గత పది సంవత్సరాల నుండి రాజకీయ నాయకులుగా ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికీ రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు.
మరోవైపు బీసీ రిజర్వేషన్ 42% పెంచుతున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేపట్టి ఇప్పటికే గవర్నర్కు ఆమోదం కోసం వేచి చూస్తున్నా ప్రభుత్వానికి గత వారం రోజుల క్రితం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికలపై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో గ్రామాల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అభ్యర్థులు ఆలోచనలో పడ్డారు. ఎన్నికలు జరుగుతాయా లేక జరిగిన వాటిని రద్దు చేస్తారా లేక వాయిదా పడతాయా అనే ఆలోచనలు అందరి మదిలో మెదులుతున్నాయ.స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నాయకుల్లో గుబులు రేపుతున్న ప్రశ్నలు. జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా వీటి గురించే చర్చ జరుగుతుంది. ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు.
ఇప్పటికే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నాయకులల్లో భయం పట్టుకుంది. ఈనెల 8న హైకోర్టులో స్థానిక సంస్థలపై వెలువడనున్న తీర్పు పైనే ఆధారపడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా రిజర్వేషన్లు కాస్త మారుతాయన్న అంశంపైనే చర్చించుకుంటున్నారు. బీసీల రిజర్వేషన్ను తగ్గించి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తే మరి కొంతమంది ఆశావాహుల్లో ఆశలు పుట్టుకొస్తాయని ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు.
ఆవిరైన ఆశావాహుల ఆశలు…
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేండ్లు రిజర్వేషన్లు ఉంటాయని ప్రకటించడంతో గ్రామాల్లో గతంలో హడావుడి చేసిన నాయకులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత 2019 స్థానిక సంస్థల రిజర్వేషన్లకు భిన్నంగా రిజర్వేషన్లు మారాయి. ఆశావాహుల ఆశలు ఆవిరయ్యాయి.బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు చేస్తూ ఒక ప్రత్యేక జి ఓ నువ్వు కూడా పాస్ చేసింది. దీంతో బీసీలకు రిజర్వేషన్లు పెరగడంతో మరింతగా ఆశావాహులు పెరిగారు.
స్థానిక సంస్థల చర్చలే ప్రధాన అంశం…
జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా ఇప్పుడు ఆయా పార్టీల నాయకుల్లో మా పార్టీలో మా వర్గం నుంచి పలాన వ్యక్తి సర్పంచ్ అభ్యర్థి,పలాన వ్యక్తి ఎంపీటీసీ అభ్యర్థి అన్న మాటలు విని పిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యా పారం మందగించడంతో నాయకులు, కార్యకర్తలు అంతా ఖాళీగానే ఉన్నారు. వీరంతా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, వస్తే ఎలా వివరించాలనే ఆలోచనలో పడ్డ నాయకులకు ఆశావాహులకు ఎన్నికల తేదీని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో ఆశావాహుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రెండు విడుదల, సర్పంచ్ వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కొద్దిరోజుల గడువు మాత్రమే ఉండడంతో ఆశావాహులు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు.