-జగిత్యాల మున్సిపల్ లో ఏసీబీ చర్యలు…రాయికల్లో ఆసక్తికర పరిణామాలు
-5 లక్షలు పెట్టు… కో-ఆప్షన్ పట్టు..?
-ఇప్పటికే 13 దరఖాస్తులు… మరిన్ని వచ్చే అవకాశం
నవతెలంగాణ – రాయికల్
మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు ప్రకటన మేరకు కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు సభ్యులు (ఒకరు మహిళ),మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులు (ఒకరు మహిళ)ను ఎంపిక చేయనున్నారు.
అభ్యర్థులు నేటి సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. అయితే మంగళవారం వరకు సుమారు 13 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అయితే కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో పట్టణంలో చర్చలు జోరందుకున్నాయి. ఒకవైపు అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానించగా…మరోవైపు ఎంపిక విధానం, ప్రమాణాల అమలు, పారదర్శకత వంటి అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పట్టణంలో కో-ఆప్షన్ సభ్యుల నియామకాన్ని కొందరు డబ్బుతో ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.“5 లక్షలు పెట్టు… కో-ఆప్షన్ పట్టు”అనే మాటలు ఇప్పుడు పట్టణంలో బహిరంగంగానే వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
కొంతమంది స్థానిక నాయకులు, మధ్యవర్తులు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. డబ్బు ఆధారంగా లాబీయింగ్ జరుగుతోందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
జగిత్యాలలో ఏసీబీ చర్యలు..రాయికల్ లో చర్చలు..!
ఓవైపు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పన్నుల వసూళ్లు, అసెస్మెంట్ల డి-ఆక్టివేషన్, డీజిల్ వాహనాల కొనుగోలు, మరమ్మత్తులు తదితర అంశాల్లో వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ తనిఖీలు నిర్వహించగా, మరోవైపు రాయికల్ పట్టణంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి వివిధ కోణాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రెండు పరిణామాలు పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.
-తెర వెనుక ప్రభావం ఉందా..?
ఎంపిక ప్రక్రియపై స్థానికంగా పలు వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రభావశీలులు ఈ ప్రక్రియపై ప్రభావం చూపుతున్నారనే చర్చలు జరుగుతున్నప్పటికీ… దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. గతంలో పట్టణానికి సేవలందించిన మాజీ ప్రజా ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు మొదట ఆసక్తి చూపినప్పటికీ… వివిధ కారణాల వల్ల కొందరు వెనక్కు తగ్గినట్లు సమాచారం. దీంతో ఎంపిక ప్రక్రియపై మరింత ఆసక్తి,పలు అనుమానాలు నెలకొన్నాయి.
కో-ఆప్షన్ సభ్యుల పదవులు సామాజిక న్యాయం, ప్రతినిధిత్వం కోసం ఉద్దేశించినవి. కానీ ఇవి డబ్బు లావాదేవీలకు వేదికగా మారితే ప్రజాస్వామ్య వ్యవస్థపైనే నమ్మకం దెబ్బతింటుందని ఓ వైపు రాజకీయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు.
-పారదర్శకతపై ప్రజల ఆశలు..
ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుతున్నారు. అర్హత, అనుభవం, సామాజిక సేవ వంటి ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియపై ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా అధికారులు స్పష్టత ఇవ్వడం, ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించడం అవసరం.
-ఉన్నతాధికారులు స్పందించాలి..
ప్రజాసేవ కోసం ఉండే కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో నిష్పక్షపాతత, పారదర్శకత కీలకం. ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలంటే ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్పష్టంగా ఉండాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రక్రియ వ్యవహారం సజావుగా సాగేందుకు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు.



