Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆటో కిరాయి విషయంలో గొడవ

ఆటో కిరాయి విషయంలో గొడవ

- Advertisement -

తుపాకీతో కాల్చిన గుర్తు తెలియని వ్యక్తి
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలింపు
నర్కూడలో ఘటన


నవతెలంగాణ-శంషాబాద్‌
ఆటో కిరాయి మాట్లాడుకునే విషయంలో మాట మాటా పెరిగి ఇరువురి మధ్య గొడవ జరిగి చివరకు తుపాకీ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నర్కూడ గ్రామంలో గురువారం జరిగింది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన సమీర్‌ దాస్‌ ఎనిమిదేండ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం చార్మినార్‌కు వచ్చాడు. సొంతంగా గోల్డ్‌ స్మిత్‌ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతను శంషాబాద్‌ మండల పరిధిలోని నర్కూడ గ్రామ ట్రినిటీ మోడల్‌ స్కూల్‌ పక్కన ప్లాటు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఈ నెల 25వ తేదీన గృహ ప్రవేశం చేయాలని ముహూర్తం నిర్ణయించారు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. సమీర్‌ అల్లుడు పింటు హాతి, అతని స్నేహితులు కొత్త ఇంటికి వచ్చారు.

వారు పని ముగించుకొని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వెళ్దామనుకుంటే స్కూటీ స్టార్ట్‌ కాలేదు. దీంతో వారు ఆన్‌లైన్‌లో వెహికల్‌ బుక్‌ చేసుకొని వెళ్లాలని భావించారు. అదే సమయంలో అటుగా ఒక ఆటో వెళ్తున్నది. పింటు ఆ ఆటోను ఆపి సిటీ కాలేజీ వరకు రావాలని డ్రైవర్‌తో బేరమాడాడు. రూ.800 ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ అడిగితే రూ.500 ఇస్తామని చెప్పారు. అందుకు డ్రైవర్‌ ఒప్పుకోకపోవడంతో సమీర్‌ వెళ్లిపొమ్మన్నాడు. దాంతో ఆటోలో వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తులు ఆగ్రహానికి గురై ‘ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన కొడుకులు’ అంటూ దుర్భాషలాడారు. దాంతో గొడవ జరిగింది. ఈ సమయంలో ఆటోలోని ఒక వ్యక్తి తుపాకిని (ఎయిర్‌ గన్‌) తీసి సమీర్‌ దాస్‌ కడుపులో ఫైర్‌ చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతటితో ఆగని ఆ వ్యక్తి సమీర్‌ అల్లుడు, అతని స్నేహితులనూ కాల్చేస్తాని బెదిరించడంతో వారు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఆటోలో వారూ వెళ్లిపోయారు. అనంతరం సమీర్‌ అల్లుడు 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. గాయపడిన సమీర్‌ను శంషాబాద్‌లోని లిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -