దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఏకోపాధ్యాయ స్కూళ్లు
ఆందోళన కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వ విద్యావిధానం
అటకెక్కిన ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ స్కీం
రాష్ట్రాలకు మార్గదర్శనం చేయడంలో కేంద్రం విఫలం
న్యూఢిల్లీ : దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. దీనికి కేంద్రప్రభుత్వ నూతన విద్యావిధానం కారణంగా నిలుస్తోంది. విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం, దానిలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీంను చేర్చలేదు. దీనివల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీన్ని సాకుగాచూపి, ఆయా స్కూళ్లను మూసివేయడం లేదా సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడం చేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు తప్పనిసరిగా ప్రయివేటు స్కూళ్లను ఆశ్రయించాల్సి వస్తుంది. వాస్తవానికి ఏకోపాధ్యాయ స్కూళ్ళ ఆశయం వేరైనా..ఆర్బాటంగా ప్రారంభించి..నెమ్మదిగా మూసేయటం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 2022-23లో 1,18,190 ఉన్నాయి. 2023-24 నాటికి వాటి సంఖ్య 1,10,971కి తగ్గింది. 2024-25 నాటికి ఈ సంఖ్య మరింత క్షీణించి 1,04,125కు పరిమితమైంది. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 14,065 ఏకోపాధ్యాయ స్కూళ్లు తగ్గిపోయాయనేది అధికారిక లెక్క. అయితే 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అనేకం కాగితాల్లోనే ఉన్నాయనీ, అక్కడి టీచర్లను సమీప స్కూళ్లలోకి బదిలీ చేసి, రికార్డుల్లో అలాగే ఉంచేశారనే విమర్శలు ఉన్నాయి. స్కూళ్లు తగ్గించారని అధికారికంగా తెలీకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉంటే మౌలిక సదుపాయాల కల్పన కష్టమవుతుందనీ, అందువల్ల తక్కువ మంది పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేసే ఉద్దేశ్యంతో ఏకోపాధ్యాయ పాఠశాలల్ని నెలకొల్పారు.
రాష్ట్రంలో…
1986లో రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలని నిర్దేశించారు. దీనిలో టీచర్- విద్యార్థుల నిష్పత్తిని కూడా నిర్ధారించారు. అవసరమైన చోట్ల ముగ్గురు టీచర్లను కూడా నియమించుకొనే వెసులుబాటు కల్పించారు. 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చాక, 2011లో టీచర్, స్టూడెంట్ రేషియోను 1:30గా పేర్కొన్నారు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలనే నిబంధన ఎత్తేశారు. దీనితో స్కూళ్లను రేషనలైజ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,001 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. జాతీయ స్థాయితో పోల్చితే తెలంగాణ 11వ స్థానంలో ఉంది. 2015లో ఏకోపాధ్యాయ స్కూళ్లను రేషనలైజ్ చేశారు. 10 మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే స్కూళ్లను మూసేశారు. 20 లోపు విద్యార్థులు ఉంటే ఒక టీచర్, 20 నుంచి 60 వరకు ఇద్దరు టీచర్లు, 61 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే మూడో టీచర్‌ను ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే విధానం కొనసాగుతోంది. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. ఒకే టీచర్‌తో ఐదవ తరగతి వరకు 18 సబ్జెక్టుల్ని బోధించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరపెడుతూ ప్రయివేటు స్కూళ్లవైపు మొగ్గుచూపడం మొదలు పెట్టారు. దానితో పాటు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒకే టీచర్ ఉండటం వల్ల ఆయన సెలవులు పెట్టినా, శిక్షణా తరగతులు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరైతే పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇలాంటి కారణాలతో విద్యార్థులు డ్రాప్ అవుట్ కావడం లేదా ప్రయివేటు స్కూళ్లకు వెళ్లిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఏకోపాధ్యాయ స్కూళ్లు మూతపడుతున్నాయి. ప్రాథమిక విద్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా మధ్యాహ్న భోజనం, స్కూల్ నిర్వహణ. బిల్డింగ్ ఫండ్ వంటివన్నీ 60:40 నిష్పత్తిలో నిధులు ఇస్తుంది. దీనిలో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్రం 40 శాతం ఖర్చును భరిస్తుంది. అయితే కేంద్రం 30 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న ఏకోపాధ్యాయ స్కూళ్లను నాన్ వయోబుల్‌గా పరిగణిస్తోంది. వీటిని సమీప స్కూళ్లలో విలీనం చేయమని చెప్తోంది. 1 కి.మీ., పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూళ్లు, 3 కి.మీ., పరిధిలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 5 కి.మీ., పరిధిలో ఉన్న హైస్కూళ్లలో సమీప ఏకోపాధ్యాయ స్కూళ్లను విలీనం చేయమని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల చాలా స్కూళ్లు మూతపడ్డాయి. మరికొన్ని సమీప పాఠశాలల్లో విలీనం అయ్యాయి. తెలంగాణలో ఈ ఏడాది స్కూళ్లను రేషనలైజ్ చేయలేదు. 2015లో రేషనలైజ్ చేశారు. రాష్ట్రంలో వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో పిల్లలు తగ్గిపోయిన స్కూళ్ల నుంచి టీచర్లను వేర్వేరు స్కూళ్లకు సర్దుబాటు చేస్తున్నారు. రికార్డుల్లో ఆ స్కూల్ ఉంటుంది. కానీ అక్కడ విద్యార్థులు, టీచర్లు ఉండరు. కేంద్రం విద్యాహక్కు చట్టం తెచ్చినా ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ స్కీంను కొనసా గించి, కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలనే నిబంధన పెట్టి ఉంటే ఈ పరిస్థితులు ఏర్పడేవి కావని ఉపాధ్యాయసంఘాలు అభిప్రాయప డుతున్నాయి.
దేశంలో…
దేశవ్యాప్తంగా 33 లక్షలకన్నా ఎక్కువ మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నట్టు 2024-45 విద్యాసంవత్సర నివేదికలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. సగటున ఒక్కో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 34 మంది విద్యార్థులు చదువుతున్నట్టు పేర్కొంది. దేశంలో అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తెలంగాణ 11వ స్థానంలో ఉంది.
విద్యాహక్కు చట్టం కింద..
దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,04,125 ఉన్నాయి. వాటిలో 33,76,769 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైమరీ స్థాయి స్కూళ్లలో (1-5వ తరగతి ) 30:1 శాతంలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఉండాలి. ఉన్నత ప్రాథమిక స్థాయిలో (6-9వ తరగతి వరకు) 35:1 ఉండాలి.
స్టూడెంట్ ఎన్‌రోల్‌మెంట్
స్టూడెంట్స్ ఎన్‌రోల్‌మెంట్‌లో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 6,24,327 మంది విద్యార్థులు ఎన్‌రోల్ అయి ఉన్నారు. జార్ఖండ్‌లో 4,36,480 మంది, పశ్చిమబెంగాల్‌లో 2,35,494, మధ్యప్రదేశ్‌లో 2,29,095, కర్నాటక లో 2,23,142, ఆంధ్రప్రదేశ్‌లో 1,97,113, రాజస్థాన్‌లో 1,72,071 మంది విద్యార్థులు ఎన్‌రోల్ అయ్యారు. ఒక్కో పాఠశాలకు సగటు విద్యార్థుల నమోదులో చండీగఢ్, ఢిల్లీ టాప్‌లో ఉన్నాయి. దేశ రాజధానిలో 1,222, చండీగఢ్‌లో 808 మంది విద్యార్థులు ఉన్నారు. లడఖ్, మిజోరాం, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో వరుసగా 59, 70, 73, 82 మందితో అతి తక్కువగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఉంది.
టీచర్-స్టూడెంట్ నిష్పత్తి మార్చాలి
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ స్కీంను కొనసాగించి, టీచర్- స్టూడెంట్ నిష్పత్తిని సవరించాలి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుంది. ఏకోపాధ్యాయ స్కూళ్లలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండేలా చూడాలి. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్-స్టూడెంట్ నిష్పత్తిని 1:20గా మార్చాలి. దీనివల్ల అందరికీ విద్య అందుబాటులో ఉంటుంది. ఈ సవరణల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రాలకు ఆ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి. – చావ రవి, అధ్యక్షులు, టీఎస్‌యూటీఎఫ్
ఢిల్లీలో తొమ్మిది సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లడఖ్, దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, చండీగఢ్‌లలో ఏకోపాధ్యాయ స్కూల్స్ లేవు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కేవలం నాలుగు సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి.
ఇవీ స్కూళ్ల లెక్కలు
రాష్ట్రం ఏకోపాధ్యాయ స్కూళ్లు
ఆంధ్రప్రదేశ్ 12,912
ఉత్తరప్రదేశ్ 9,508
జార్ఖండ్ 9,120
మహారాష్ట్ర 8,152
కర్నాటక 7,349
లక్షద్వీప్ 7,217
మధ్యప్రదేశ్ 7,217
పశ్చిమబెంగాల్ 6,482
రాజస్థాన్ 6,117
ఛత్తీస్‌గఢ్ 5,973
తెలంగాణ 5,001