అణగారిన వర్గాలు విద్యకు దూరం
ఎన్‌ఈపీతో దేశ భవిష్యత్‌కు ప్రమాదం
పాఠ్యపుస్తకాల్లో పలు అధ్యాయాల తొలగింపు
ఉన్నత సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ
విద్యార్థులు, నిపుణుల ఆందోళన
మోడీ సర్కారుపై తీవ్ర అసంతృప్తి
నూతన విద్యా విధానం- 2020కి ఐదేండ్లు పూర్తైన సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ సదస్సు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివాదాస్పద నూతన విద్యా విధానం- 2020(ఎన్‌ఈపీ-2020)ని తీసుకొచ్చి విద్యా రంగాన్ని సంఘ్ సిద్ధాంతానికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్‌ఈపీని తీసుకొచ్చి ఇప్పటికే ఐదేండ్లు పూర్తవుతున్నది. దీని ద్వారా విద్యా రంగంలో జరుగుతున్న మార్పులు దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, చరిత్ర, సైన్స్‌కు వక్రభాష్యాలు చెప్తూ విద్యార్థుల మెదళ్లను కలుషితం చేస్తున్నది. దేశంలో అణగారిన వర్గాలను విద్యకు దూరం చేస్తున్నది. పాఠ్యపుస్తకాల నుంచి కీలక అంశాలను తొలగిస్తున్నది. దీంతో ఎన్‌ఈపీపై విద్యార్థులు, విద్యావేత్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ న్యూఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో ”చరిత్ర మరియు సైన్స్ వక్రీకరణ” అంశంపై ఆలిండియా సెమినార్‌ను నిర్వహించింది. ఈ సదస్సుకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడి ఆడిటోరియం నిండిపోయింది. ఇది ఎన్‌ఈపీ విషయంలో మోడీ సర్కారుపై విద్యార్థులలో పెరుగుతున్న ఆందోళనకు నిదర్శనంగా మేధావులు, విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు. విద్యా విధానం వల్ల పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు.. దేశంలోని అణగారిన వర్గాలు వెలివేయబడుతున్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీకి చెందిన ఇంటర్ విద్యార్థితని షాహీన్ అఫ్రోజ్ మాట్లాడుతూ… ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలలో అధ్యాయాలను యథేచ్ఛగా తొలగించారని విమర్శించారు. ప్రపంచ రాజకీయాల పుస్తకంలో కోల్డ్ వార్, అమెరికా ఆధిపత్యం అధ్యాయాలు తొలగించారనీ, ఉపాధ్యాయులు కూడా వాటి గురించి చెప్పటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలల మూసివేత.. విద్యకు దూరమవుతున్న పిల్లలు
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పీజీ విద్యార్థి వివేక్ మాట్లాడుతూ… ఎన్‌ఈపీ విద్యను సమానత్వంతో అందిస్తామన్న హామీకి విరుద్ధంగా పరిస్థితులు మారుతున్నాయని అన్నారు. 2014-2025 మధ్య కాలంలో దేశవ్యాప్తంగగా 90 వేలకు పైగా పాఠశాలలు మూసివేయబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్‌లోనే గత మూడేండ్లలో 818 పాఠశాలలు మూసివేశారని సదరు విద్యార్థి వివరించారు.
ఫీజుల పెంపు… సామాన్యుడి జేబుకు చిళ్లు
మరొక విద్యార్థి పవన్ మాట్లాడుతూ దేశంలోని విద్యా సంస్థల్లో ఫీజుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకపక్క కుటుంబాల ఆదాయాలు తగ్గుతుంటే విశ్వవిద్యాలయాలు మాత్రం ఫీజులు పెంచుతున్నాయని విమర్శించారు. యాపిల్ రైతుల ఆదాయం కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల పడిపోతుండగా.. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ ప్రతీ ఏడాది పది శాతం ఫీజు పెంపును ఆమోదించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాలు, వర్సిటీ యాజమాన్యాల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
శాస్త్రీయ ఆలోచనలపై దాడి
ప్రముఖ శాస్త్రవేత్త, కవి గౌహర్ రజా మాట్లాడుతూ… శాస్త్రీయ ఆలోచనలపై దాడి 2014లోనే మొదలైందని ఆరోపించారు. గణేశుడి తల మార్పిడి వంటి వ్యాఖ్యలను శాస్త్రంగా ప్రచారం చేయడం, డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం వంటి పరిణామాలు శాస్త్రీయతను దెబ్బ తీశాయని అన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా పంచగవ్యం(ఆవు మూత్రం, పేడ మొదలైనవి)పై కోట్ల రూపాలయ పరిశోధనా నిధులు ఖర్చు చేయడాన్నిన ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సైన్స్ వక్రీకరణ విద్యార్థుల ఆలోచనా తీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. దేశంలో 2021లో 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు 26.5 కోట్ల మంది కాగా.. ప్రస్తుతం అది 24 కోట్లకు తగ్గిందని రజా వెల్లడించారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకర సంకేతమనీ, కానీ ఈ విషయంలో మీడియా మౌనంగా ఉన్నదని విమర్శించారు.
చరిత్ర వక్రీకరణపై ఆందోళన
చరిత్రకారిణి రుచికా శర్మ… కేంద్రంలోని మోడీ పాలనలో విద్యారంగంలో వస్తున్న ప్రతికూల మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం పాలకులను ఏకపక్షంగా దుష్టులుగా చూపించడం, కుల వ్యవస్థలోని సమస్యలను చిన్నవిగా చేసి చూపడం, శాస్త్రీయ ఆధారాలను వక్రీకరించడం వంటి ప్రమాదకర ధోరణులు విద్యలో కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలలో ‘డార్క్ ఏజ్’ వంటి పదాలను ప్రవేశపెట్టడం విద్యా ప్రమాణాలకు విరుద్ధమనీ, ఇది హిందూత్వ భావజాల ప్రభావమని ఆమె వ్యాఖ్యానించారు.
ఉన్నత సంస్థలపై కేంద్రం నియంత్రణ
దేశంలో విద్యను నియంత్రించే పలు ఉన్నత సంస్థలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంఫ్‌ు ఆదేశాలనుసారం పని చేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. చరిత్రకారుడు ఆర్.గోపీనాథ్ మాట్లాడుతూ… నిజమైన చరిత్రకారులను తొలగించి, తమ భావజాలానికి అనుకూలంగా ఉన్నవారిని సంస్థల్లో నియమిస్తున్నారని మోడీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్’ పేరిట వేద గ్రంథాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భిన్నత్వాన్ని విస్మరిస్తున్నారని ఆయన అన్నారు.
విద్యార్థులు సంఘటితమై పోరాడాలి
విద్యపై ఇలాంటి నియంత్రణ ఏ మాత్రమూ సరికాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ద్వేష వాతావరణంలో నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ రామ్ పున్యానీ అన్నారు. ఈ విషయంలో విద్యార్థులంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఈపీ అమలుకు ఐదేండ్లు పూర్తయిన ఈ సమయంలో దేశ విద్యా రంగంలో మార్పులు తరతరాల భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్య శాస్త్రీయంగా, సమానత్వంతో సాగాలంటే.. విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు చేసే ఇలాంటి నిర్మాణాత్మక విమర్శలకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నదని వారు అంటున్నారు.



