నవతెలంగాణ – కాటారం
ప్రతాపగిరి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది చల్లని ఓదార్పు అందించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కూలీల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 80 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకరయ్య, ఉపసర్పంచ్ బియ్యని రాజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బందెల స్వామి, ఆశ వర్కర్ కండెల స్వరూప కలిసి కూలీలకు మజ్జిగతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేశారు. తీవ్రమైన వేసవి వేడి కారణంగా శరీరంలో నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ చర్యతో ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న ప్రజాప్రతినిధులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.



