Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేపల చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల పంపిణీ..

చేపల చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల పంపిణీ..

- Advertisement -

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

జిల్లాలోని అన్ని చేపల చెరువులు,రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల  పంపిణీకి సంసిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి వివరించారు. సోమవారం రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యాపేట జిల్లాలో చేప పిల్లల పంపిణీకి రూట్ మ్యాప్ తో సహా సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో ఇదే అంశంపై సమీక్ష నిర్వహిస్తూ ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా చెరువులు, రిజర్వాయర్లలో  చేప పిల్లలను వదిలేందుకుగాను, నియోజకవర్గాల వారీగా చేప పిల్లల స్టాకింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలలో  గ్రామ సెక్రటరీలు, ఏ ఈ ఓ లు, ఎంపీడీవోలను భాగస్వాములను చేయాలని చెప్పారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పై ప్రణాళిక రూపొందించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు  సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.అంతకుముందు మత్స్య శాఖ మంత్రి ఒకటి శ్రీహరి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ల తో మాట్లాడుతూ  జిల్లాలోని చేపల చెరువులలో  ఉచిత చేప పిల్లల  పంపిణీ కార్యక్రమం ప్రారంభించుటకు రూట్ మ్యాప్ తయారు చేసుకుని సిద్ధంగా  ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో  ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని చెరువులలో, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు గాను జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇట్టి బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, ఇరిగేషన్ అధికారులను, మత్స్య సహకార సంఘాలను, గ్రామపంచాయతీ సిబ్బందిని భాగస్వాములు చేయాలని  చెప్పారు.తెలంగాణలో జీవనదులైన గోదావరి, కృష్ణ ఉన్నందున వాటి క్రింద ఉన్న రిజర్వాయర్లలో, చెరువులలో చేపల ఉత్పత్తి గణనీయంగా  పెంచాలని, మన రాష్ట్రం నుండి చేపలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసే విధంగా   తెలంగాణ రాష్ట్రం చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలలో చేపల మార్కెట్లు ఏర్పాటు చేయుటకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే చేపల మార్కెట్లు  నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణలో వరి ధాన్యం అత్యధికంగా పండినట్లుగానే, చేపల ఉత్పత్తి కూడ అదేవిధంగా ఉండాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి  బి. నాగులు, డిపిఓ యాదగిరి, జిల్లా ఇరిగేషన్ అధికారి యాదగిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -