తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న దాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి మరో విశిష్ట సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనీ సుభాష్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన సొంత ఖర్చుతో ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూ.2 లక్షల విలువైన ఆధునిక ఆఫీస్ ఫర్నిచర్‌ను అందించేందుకు ముందుకు వచ్చారన్నారు.
గ్రామ పంచాయతీలు ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు తగిన వసతులు అవసరమని భావించిన సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనీ పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులు, సిబ్బంది కార్యాలయాల్లో సౌకర్యవంతంగా పనిచేయడానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలు వంటి సామగ్రిని అందజేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 19 – 02 – 2026, గురువారం రోజున మొదటి విడతగా సుమారు 50 నుండి 60 గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, అధికారులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాల రూపురేఖలు మారి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకుంటూ, ప్రజాసేవే పరమావధిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సుభాష్ రెడ్డి ని స్థానిక ప్రజలు, నాయకులు అభినందిస్తున్నారనీ తెలిపారు. ఇకపై నియోజకవర్గ అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాదాత, సామాజిక సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బీబీపట మండలం మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, అశోక్ గౌడ్, చాట్ల బాబు, సిద్ధ రాంరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.



