– సీఎం చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేత
– రూ.1200 కోట్లతో రోడ్ల నిర్మాణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షలో మంత్రులు
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈనెల 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మంత్రులు తెలిపారు. అప్పటివరకు రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈనెల 13లోగా పరిశీలించి అర్హులైన వారందరినీ ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని, ప్రతిరోజూ రైతులకు సంబంధించిన అంశాలపై మండల స్థాయి అధికారులతో జిల్లా అధికారి పర్యవేక్షణ చేయాలని మంత్రులు సూచించారు. రైతు భరోసా, రైతు బీమా, ఎరువులు, విత్తనాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, భూసేకరణపై ఎమ్మెల్యే దృష్టి నిలపాలని కోరారు. ఎస్‌ఎల్‌బీసీ పనుల పున్ణప్రారంభానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు హామ్ పథకం కింద డబుల్ రోడ్ల నిర్మాణం చేపడతామని, పంచాయతీరాజ్ రోడ్లను కూడా హామ్ కిందకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేకంగా రివ్యూ చేస్తామని చెప్పారు. ప్రాథమిక వైద్యం, విద్య ప్రభుత్వానికి అతి ముఖ్యమైనవని, వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, నేనావత్ బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మెన్ గుత్తా అమిత్‌రెడ్డి, కలెక్టర్లు ఇల్లా త్రిపాఠి, హనుమంతరావు, తేజన్‌నందలాల్ పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
14న ‘తుంగతుర్తి’ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES