నవతెలంగాణ- రాయపోల్
విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల తల్లిదండ్రుల సహకారంతో షూ, టై, బెల్ట్, క్రీడా దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి చదువుతోపాటు క్రీడలలో రాణించినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని క్రీడలు శారీర దృఢత్వానికి మానసిక ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు నైపుణ్యత పెంపొందుతాయన్నారు.
పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు గ్రామస్తులు సహకరిస్తుంటే పాఠశాల అద్భుతంగా తీర్చిదిద్దబడతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏకరూప దుస్తులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలలో విద్యను అభ్యసించే 112 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు ఏర్పాటుకు సహకరించిన తల్లిదండ్రులు, గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయలు నరేష్, జీనథ్, మాధురి, సాజిద్, సిఆర్పి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.