నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణపై తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలు, హాజరు రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో శుభ్రత, వైద్య సిబ్బంది సమయపాలన, రోగుల పట్ల వ్యవహార శైలి వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో వైద్యాధికారి సాయి ఈశ్వరి, సంబంధిత వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



