ఎన్హెచ్ఎం ఉద్యోగుల హెచ్చరిక
కలెక్టరేట్ ఎదుట ప్రారంభమైన నిరసన
నవతెలంగాణఆసిఫాబాద్
తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదని నేషనల్ హెల్త్ మిషన్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ బి ఎస్ కే మెడికల్ అధికారులు కౌటిల్య, నరేందర్ రెడ్డి, ఎం ఎల్ హెచ్ పి వైద్యురాలు కీర్తనలు మాట్లాడుతూ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాల పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను అందించాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు స్థాయి నిర్ధారణ అమలు చేసి, 100 శాతం గ్రాస్ వేతనాలు చెల్లించాలని కోరారు.
ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించేందుకు స్టేట్ హెల్త్ సొసైటీ (ఎస్‌హెచ్‌ఎస్) పరిధిలోకి తీసుకువచ్చి, స్పార్ష్ విధానం ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. 2022 నుంచి 5 శాతం ఇంక్రిమెంట్‌తో పాటు 8 శాతం బోనస్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో మాదిరిగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని, మహిళ ఉద్యోగులకు వర్తించే ప్రసూతి సెలవుల విషయంలోనూ న్యాయం చేయాలన్నారు. ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు అవసరమైన వైద్య సహాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఉద్యోగికి ఈహెచ్‌ఎస్, ఈఎస్‌ఐ ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను చెల్లించడంతో పాటు వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిడిఎం శ్రీకాంత్, జిల్లా ఎపడమాలజిస్ట్ ప్రశాంత్, క్వాలిటీ మేనేజర్ సాయి ప్రసాద్, ఏఎన్ఎం సంతోషి, జిల్లా ఎకౌంట్స్ మేనేజర్ ప్రవీణ్, డాటా ఎంట్రీ ఆపరేటర్ షకీల్, డిపిఓ వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)