Magazines

అశ్వారావుపేట చరిత్రలో సువర్ణ అధ్యాయం

1 గంట క్రితం

A golden chapter
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

- సెంట్రల్ లైటింగ్ వెలుగులు.. 

- రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు

- ల్యాండ్‌మార్క్‌గా ఏరియా ఆసుపత్రి, యంగ్ ఇండియా స్కూల్ భవనాలు

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట రాజకీయ, భౌగోళిక చరిత్రలో 2026 సంవత్సరం ప్రత్యేక అధ్యాయంగా నిలవనుంది. రాష్ట్రస్థాయి అండర్‌ - 20 బాలికల కబడ్డీ పోటీలు, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం ఇప్పటికే ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టాలుగా నిలిచాయి. మరోవైపు నిర్మాణంలో ఉన్న ఏరియా ఆసుపత్రి, యంగ్ ఇండియా స్కూల్ భవన సముదాయాలు భవిష్యత్తులో పట్టణానికి ల్యాండ్‌మార్క్‌గా నిలవనున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న అశ్వారావుపేట తెలంగాణకు ముఖద్వారంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతం, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవతో 2024లో రెండో శ్రేణి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో మున్సిపల్ పాలకవర్గం ఏర్పడింది. పట్టణ అభివృద్ధే లక్ష్యంగా చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్‌ చైర్‌పర్సన్ జూపల్లి రమేష్‌బాబు పనిచేస్తున్నారు.


ఈ క్రమంలో పట్టణానికి కొత్త శోభను తీసుకొచ్చేందుకు సెంట్రల్ లైటింగ్ పనులను వేగవంతం చేశారు. అక్టోబర్ 10 నుంచి 12 వరకు తెలంగాణ యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌ - 20 బాలికల కబడ్డీ పోటీల ప్రారంభం సందర్భంగా సెంట్రల్ లైటింగ్ వెలుగులు అందుబాటులోకి రావడం పట్టణ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.


ఇదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఏరియా ఆసుపత్రి పూర్తయితే స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. యంగ్ ఇండియా స్కూల్ భవన సముదాయం అందుబాటులోకి వస్తే విద్యారంగానికి మరింత ఊతం లభించనుంది. ఈ మూడు అభివృద్ధి కార్యక్రమాలు అశ్వారావుపేట పట్టణ రూపురేఖలను మార్చడంతోపాటు, భవిష్యత్తులో పట్టణ ప్రగతికి గుర్తులుగా నిలిచే అవకాశముంది.

Ashwaraopet

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్