- డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి
- ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరాముల సారంగపాణి
నవతెలంగాణ-సత్తుపల్లి
త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరాముల సారంగపాణి పిలుపునిచ్చారు. మంగళవారం సత్తుపల్లిలో గ్రాడ్యుయేట్లతో నిర్వహించిన సమావేశంలో సారంగపాణి మాట్లాడారు. ఓటు హక్కు అనేది మన ప్రాథమిక బాధ్యత అని, అర్హులైన మిత్రులందరినీ చైతన్యపరచి ఓటు నమోదయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్తగా ఓటర్ల జాబితాను తయారు చేస్తారని, ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయిందని తెలిపారు.
అర్హులైన వారు ఫారమ్-18 ద్వారా నవంబర్ 6 వరకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సారంగపాణి తెలిపారు. 2026 నవంబర్ 1 నాటికి కనీసం మూడేళ్ల ముందే అంటే 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఓటుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 25న ముసాయిదా ప్రచురణ, డిసెంబర్ 30న తుది జాబితా విడుదల పూర్తి అయ్యాక 2027 ప్రారంభంలో పోలింగ్ జరుగుతుందన్నారు. గతంలో ఓటు ఉన్నప్పటికీ పాత ఓటర్లు సైతం మళ్లీ కొత్తగా ఫారమ్-18 సమర్పించడం తప్పనిసరి అని సారంగపాణి తెలిపారు. దరఖాస్తుదారులు డిగ్రీ కాన్వొకేషన్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్‌పై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి అప్‌లోడ్ చేయించుకోవాలన్నారు. సర్టిఫికేట్‌లో ఉత్తీర్ణులైన సంవత్సరం, తేదీ స్పష్టంగా ఉండాలని, పేరు, ఆధార్, చిరునామా వివరాలు ఆధారాలతో సరిపోలేలా చూసుకుంటూ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని శ్రీరాముల సారంగపాణి తెలిపారు.





కామెంట్‌లు (0)