- మొక్కలు నాటిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
పట్టణ సుందరీకరణలో భాగంగా అశ్వారావుపేట ప్రధాన రహదారుల సెంట్రల్ డివైడర్లను పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం డివైడర్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు తదితరులు మొక్కలు నాటారు. ప్రధాన రహదారుల వెంట పచ్చదనం పెంపొందించడం ద్వారా పట్టణానికి ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకురావడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులతో పాటు పచ్చదనం, పారిశుధ్యం, రహదారుల సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
మొక్కల సంరక్షణే కీలకం
నాటిన మొక్కలను సంరక్షించడం ద్వారా మాత్రమే కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం, రక్షణ కల్పించడం, ఎదుగుదలను పర్యవేక్షించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ప్రజలు కూడా మొక్కలను సంరక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. డివైడర్లలో పచ్చదనం విస్తరించడంతో ప్రధాన రహదారులకు మరింత ఆకర్షణీయమైన రూపం వస్తుందని తెలిపారు. పట్టణ సుందరీకరణ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు,పీఏసీఎస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, కౌన్సిలర్ లు,జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ రాంబాబు,
జిల్లా జనరల్ సెక్రెటరీ కోలా లక్ష్మీనారాయణ,సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)