- సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి
- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్
- ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలి
- వామపక్ష పార్టీల నాయకులు
నవతెలంగాణ-సత్తుపల్లి
కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను కోల్పోతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక ద్వారకాపురి లోని ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో డాక్టర్ దయానంద్ విజయకుమార్ వామపక్ష పార్టీల నాయకులతో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని విజయకుమార్ స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.
ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై వస్తున్న సందేహాలకు పారదర్శకమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దూరం పాటిస్తూ, రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా వ్యవహరించాలని డాక్టర్ దయానంద్ పేర్కొన్నారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు మోరంపూడి పాండురంగారావు, దండు ఆదినారాయణ, అమర్లపూడి శరత్ మాట్లాడుతూ ఓటర్ల హక్కులను పరిరక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజాస్వామ్య నమ్మకాన్ని కాపాడేందుకు జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు, వామపక్ష పార్టీల నాయకులు రావుల రాజబాబు, గంటా శ్రీనివాసరావు, తడికమళ్ల యోబు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)