- వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- సత్తుపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
భారత స్వాతంత్ర్య పోరాటం, నిజాం వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కదనరంగంలో తన జీవితాంతం పోరాడిన మహోన్నత నేత, నేతన్నల ఆరాధ్యుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహాన్ని మంత్రి తుమ్మల ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తుమ్మల మాట్లాడారు. నిస్వార్థ సేవకు, త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్మరణీయుడని తెలిపారు.
పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళి మాట్లాడుతూ... కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నాటి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో సెప్టెంబర్ 27, 1915న కొండా లక్ష్మణ బాపూజీ జన్మించారన్నారు. చిన్ననాటి నుంచే సేవాభావాన్ని అలవర్చుకున్న బాపూజీ మహాత్మా గాంధీ బోధించిన అహింస, సత్యసంధతలకు ఆకర్షితులయ్యారన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో సాగిన ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొని, బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని ఎదుర్కొంటూ జైలు శిక్షను సైతం అనుభవించారని తెలిపారు. నిజాం సంస్థానంలో సాగిన ప్రజాస్వామ్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి జరిగిన సాయుధ పోరాటంలోనూ, ప్రజా చైతన్యంలోనూ ఆయన ముందు పీఠిన నిలిచారని కొనియాడారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు అనంతరం సిర్పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన లక్ష్మణ్ బాపూజీ ప్రాంతీయ హక్కుల పరిరక్షణకు చట్ట సభలో గళం విప్పారని కొనియాడారు. చేనేత కార్మికుల శ్రేయస్సు, పద్మశాలి సమాజాభివృద్ధికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమైనదని అన్నారు. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి, కార్మికుల సంక్షేమానికి జీవితాంతం పాటుపడ్డారని చెప్పారు. తెలంగాణ ప్రజల బాధలను, ప్రాంతీయ సమస్యలను విస్తృతంగా ప్రచారం చేయడానికి జనధర్మ పత్రికను స్థాపించారన్నారు. నిజాం సాగర్ ముంపు ప్రాంతాల నిర్వాసితుల హక్కుల సాధనకు ఉద్యమించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 1969లో రూపుదిద్దుకున్న తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయన కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం అప్పటి చేనేత, పశుసంవర్ధక శాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి, స్వరాష్ట్ర కాంక్షకు తన మద్దతు తెలిపారని కొనియాడారు.
తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రాన్ని చూడటమే తన ఏకైక ధ్యేయంగా జీవించిన బాపూజీ, మలిదశ ఉద్యమం చివరి ఘట్టానికి చేరుకున్న తరుణంలో సెప్టెంబర్ 21, 2012న హైదరాబాద్‌లో కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజా హృదయాల్లో అమరుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, పట్టణ పద్మశాలి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు వంగరి పద్మారావు, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు వంగరి పద్మారావు, నాయకులు వెనిగళ్ల దుర్గారావు, విగ్రహ నిర్మాణ అధ్యక్షులు, కంకటి వెంకటేశ్వరరావు, జల్ల లక్ష్మనరావు, పర్వతం నాగేశ్వరరావు, పుల్లయ్య, రత్తయ్య, కేశవరావు, రామకృష్ణ, శ్రీరామ్మూర్తి, రమేష్, కైలాసం, ఆంజయులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)