- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
- నాణ్యతా ప్రమాణాలతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో చేపట్టిన భూ రీ సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
బుధవారం ఆయన రామన్నగూడెం రెవెన్యూ పరిధిలో భూ రీ సర్వే పనులను, అశ్వారావుపేటలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
భూ రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి:
రామన్నగూడెం పరిధిలో సుమారు 600 ఎకరాల్లో భూ రీ సర్వే కొనసాగుతోందని, దాదాపు 8 కిలోమీటర్ల మేర గ్రామ సరిహద్దులను నిర్ధారిస్తున్నామని సర్వేయర్లు కలెక్టర్కు వివరించారు. గత వారం గ్రామసభ నిర్వహించి సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.
సర్వే నంబర్ 39 పరిధిలో సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్ మాట్లాడి, భూముల సాగు వివరాలు, పాత పట్టాలు, పాస్బుక్లపై ఆరా తీశారు. మూడు సర్వే నంబర్ల పరిధిలో 181 మంది రైతులు ఉన్నట్లు అధికారులు వివరించగా, వారి భూములకు సంబంధించిన పట్టాలు, రైతుబంధు వివరాలు, సాగు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
రైతుల వద్ద ఉన్న పాత భూ పత్రాలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి వాస్తవాలను నిర్ధారించాలని సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భూముల విస్తీర్ణం, గ్రామ సరిహద్దులు, అటవీ బ్లాక్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, పట్టాలు, గెజిట్ నోటిఫికేషన్లు, పాత రికార్డులను ప్రస్తుత వివరాలతో పోల్చి వ్యత్యాసాలను గుర్తించాలని తెలిపారు. పది రోజుల్లో సర్వే పూర్తి చేసి భూముల హద్దులు, విస్తీర్ణం, హక్కులకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
ఆరు నెలల్లో పాఠశాల నిర్మాణం పూర్తి చేయాలి:
అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్.. భవన నిర్మాణ ప్రణాళిక, పనుల పురోగతి, విద్యార్థులకు కల్పించనున్న వసతులపై ఇంజినీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
పాఠశాలలో శాఖాహారం, మాంసాహారం వంటశాలలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థులకు డైనింగ్ హాల్, సుమారు వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ క్రీడలకు ప్రత్యేక గదులు, బ్యాడ్మింటన్ తదితర క్రీడలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అనుగుణంగా వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జూనియర్ విద్యార్థుల హాస్టల్ను జీ+2 అంతస్తుల్లో నిర్మిస్తున్నామని, డార్మిటరీలతో పాటు రెండు అంచెల పడకల సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు. గరిష్ఠంగా ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, డిసెంబర్ నెలాఖరులోగా స్లాబ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుమారు 100 మంది కార్మికులు నాలుగు బృందాలుగా పనిచేస్తుండగా, పర్యవేక్షణకు నలుగురు సైట్ ఇంజినీర్లు, నలుగురు సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా నిర్మాణ పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ పర్యటనలో తహసీల్దార్ డి. కిషోర్, ఈడబ్ల్యూఐడీసీ ఏఈఈ రాం కుమార్, ఎంఈఓ ప్రసాద్రావుతో పాటు రెవెన్యూ, సర్వే, అటవీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)