- ఇన్‌పేషెంట్ వార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్
నవతెలంగాణ - అశ్వారావుపేట
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్న అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో బి. రాహుల్ అన్నారు.
ఇందులో భాగంగా ఐటీడీఏ నిధులతో రూ.5 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. బుధవారం ఆసుపత్రిలో రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఇన్‌పేషెంట్ వార్డును వారు ప్రారంభించారు.
అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా రుక్మిణికి డెంటల్ చైర్స్, మంచాలు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర వైద్య పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన పరికరాలను సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు.
ఐటీడీఏ పీవో బి. రాహుల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి అందించిన పరికరాలతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. మారుమూల ఆదివాసీ, గిరిజన గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి గిరిజనులకు వైద్య సేవలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ సైదులు, మున్సిపల్ వైస్‌చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, ఆర్‌ఎంఓ మౌనిక, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)