Magazines

పుచ్చకాయ పంటను పరిశీలించిన అధికారులు

2 గంటల క్రితం

watermelon crop
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

- ఐదు రోజుల పాటు వర్ష సూచనలు
- మూడు రోజుల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం

- రబీ వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

- రైతులకు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ సూచన

నవతెలంగాణ - అశ్వారావుపేట

రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు రోజులు ప్రధానంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా, ఆ తర్వాత మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఐదో రోజు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.


గత మూడు రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

రబీ వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు:

ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, జలాశయాలు పూర్తి స్థాయిలో నిండకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రబీ వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయంగా తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ సూచించారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ పెసర, మినుము, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, కంది, మొక్కజొన్న, కుసుమ, శనగ, ఆముదం పంటలను సాగు చేసుకోవచ్చని తెలిపారు. దక్షిణ తెలంగాణలో వేరుశనగతో పాటు కుసుమ, శనగ, ఆవాలు, మొక్కజొన్న పంటలను నవంబర్ 15వ తేదీలోగా నాణ్యమైన విత్తనాలతో విత్తుకోవాలని సూచించారు.

వరిలో తెగుళ్ల పై అప్రమత్తంగా ఉండాలి:

ఖరీఫ్ వరి పంట ప్రస్తుతం గింజ గట్టిపడే దశ నుంచి పక్వ దశలో ఉందని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంకినల్లి ఉధృతికి అనుకూలంగా ఉన్నందున, లక్షణాలు గమనించిన రైతులు వ్యవసాయ శాఖ సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కంకినల్లి నివారణకు లీటరు నీటికి 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమెసిఫెన్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కనిపిస్తున్నందున, నివారణకు లీటరు నీటికి 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్‌తో పాటు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.4 గ్రాముల అగ్రిమైసిన్‌తో పాటు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.

పత్తిలో గులాబి రంగు పురుగు పై నిఘా:

పత్తి పంట ప్రస్తుతం కాయలు పగిలే దశ నుంచి కోత దశలో ఉందని, పచ్చదోమ, తామర పురుగుల ఉధృతిని గమనించాలని సూచించారు. పురుగుల ఉనికిని బట్టి వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మందులను మాత్రమే వినియోగించాలని తెలిపారు.

ప్రస్తుత వాతావరణం పత్తిలో గులాబి రంగు పురుగు ఆశించడానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. పొలం గట్లపై ఉన్న వయ్యారి భామ కలుపును తొలగించాలని, ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలని సూచించారు. వరుసగా రెండు మూడు రోజుల పాటు ఒక్కో బుట్టలో ఏడు నుంచి ఎనిమిది రెక్కల పురుగులు కనిపిస్తే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పురుగు నివారణకు సూచించిన మందులను ఉదయం 10 గంటలలోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారీ చేయాలని తెలిపారు.

కందిలో ఆకుచుట్టు పురుగు నివారణకు చర్యలు:

ఖరీఫ్ కంది పంట శాఖీయ దశ నుంచి పూత దశలో ఉందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆకుచుట్టు పురుగు ఆశించే అవకాశం ఉందని రవికుమార్ తెలిపారు. పంటను తరచూ పరిశీలిస్తూ పురుగు లక్షణాలు కనిపించినప్పుడు వ్యవసాయ శాఖ సిఫార్సుల మేరకు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

వేరుశనగ విత్తనశుద్ధి తప్పనిసరి:

రబీ వేరుశనగ సాగు చేసే రైతులు మొదలు కుళ్లు, కాండం కుళ్లు తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి చేయాలని సూచించారు. ఒక కిలో వేరుశనగ విత్తనానికి ఒక గ్రాము టెబుకోనజోల్ మందును కలిపి విత్తనశుద్ధి చేసిన తర్వాతే విత్తుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, పంట దశలను దృష్టిలో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా తెగుళ్లు లేదా పురుగుల లక్షణాలు కనిపిస్తే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్